మహా ఎన్నికల ప్రచారానికి ఏపీ ఉపముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమి తరఫున ఆయన మహారాష్ట్రలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో పర్యటించి ప్రచారం చేస్తారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ ప్రచారంలో భాగంగా ఆయన మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 20న ఓకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఎన్డీయే, ఇండీ కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలన్నీ ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. పవన్ కల్యాణ్ ను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా కోరినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల పవన్ కల్యాణ్  ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన సంగతి విదితమే. ఆ సందర్భంగా అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికలలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాలలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. కాగా ఈ ప్రచారంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొననున్నారు.