అరాచకానికి కేరాఫ్ గా ఏపీ.. వైసీపీ దాడులపై పవన్ కల్యాణ్ ఫైర్..
posted on Oct 19, 2021 9:34PM
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజా స్వామ్యంలో ఇటువంటి దాడులు ఎవరికీ క్షేమం కాదన్నారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు జనసేనాని. ఇటువంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని తెలిపారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు.
కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ సూచించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారని చెబుతున్నారని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కల్యాణ్ కోరారు. దోషులను శిక్షించకపోతే అరాచకానికి కేరాఫ్ గా ఏపీ మారిపోతుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.