జనసేనపై అజ్ఞాతవాసి ఎఫెక్ట్?

 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞావాసి సినిమా ఏకగ్రీవంగా అట్టర్ ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా పనిచేయడానికి సమాయత్తం అవుతున్న సందర్భమిది.  ఆమధ్య ఓసారి అజ్ఞాతవాసి సినిమానే తన చివరి చిత్రమని, ఈ సినిమా తర్వాత పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటి వరకు వున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ చివరి సినిమా. వాస్తవ పరిస్థితిని గమనిస్తే జనసేన పార్టీని పటిష్టం చేయాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లో నటిస్తూ కూర్చుంటే కుదరదు. ఎన్నికలకు ఇంకా కేవలం సంవత్సరంన్నర మాత్రమే వ్యవధి వుంది. అందువల్ల అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో సినిమా ఒప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. అయితే అజ్ఞాతవాసి సినిమా మీద పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆయన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని, సినిమా రంగానికి ఒక విజేతగా వీడ్కోలు పలికి, సగర్వంగా పొలిటికల్ లీడర్‌గా ప్రస్థానం కొనసాగించాలన్నది పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల ఆలోచన అయితే పరిస్థితి మాత్రం ఇప్పుడు రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ చివరి చిత్రంగా భావిస్తున్న సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

 

రాజకీయాల్లోకి వచ్చే ముందు నటించిన సినిమాల ప్రభావం రాజకీయ రంగం మీద కూడా వుండి తీరుతుందనేది  చరిత్ర చెబుతున్న సత్యం. తెలుగుదేశం పార్టీని స్థాపించి, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశం మీద ఆయన చివర్లో నటించిన చిత్రాల ప్రభావం వుంది. ఎన్టీఆర్ నటించిన  నాదేశం, మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలు ఆయనకు రాజకీయంగా ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ సినిమాలు సాధించిన ప్రజాదరణ రాజకీయంగా కూడా ఎన్టీఆర్‌కి ఉపయోగపడింది. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా వుంటూనే సినిమాల్లోకి ప్రవేశించిన ఘనత ఆయన సొంతమైంది. అయితేపవన్ కళ్యాణ్ మాత్రం సినిమా రంగానికి ఘోరమైన ఫ్లాపుల తర్వాత విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఒకదాన్ని మించిన ఫ్లాప్ మరొకటి అయ్యాయి. చివరి చిత్రమైతే మరీ దారుణం. రేపటిరోజున ఆయన రాజకీయ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాణించలేక రాజకీయాల్లోకి వచ్చాడని అంటే ఎదురు సమాధానం చెప్పే అవకాశం జనసేన వర్గాలకు లేకుండా పోయింది.

 

అజ్ఞాతవాసి సినిమా పుణ్యమా అని పవన్ కళ్యాణ్ క్రేజ్ మీద ఎఫెక్ట్ పడింది. ఆయన ఫ్యాన్స్ నిరాశపడిపోయారు. ఒక హిట్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వచ్చే ప్రజల్లో వుండే గౌరవం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వుండే అవకాశం లేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక మంచి హిట్ సినిమాలో నటించాలని, హిట్టు కొట్టే సినిమా రంగానికి గుడ్ బై కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది అసాధ్యమనే చెప్పాలి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించడం అంటే అంతకంతే ఘోర తప్పిదం మరొకటి వుండబోదు.  అంచేత తప్పో ఒప్పో రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వచ్చేయడమే కరెక్టన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.