పవన్ కళ్యాణ్‌కి దారులన్నీ మూసుకుపోయిన వేళ...


సినిమాల్లో స్టార్లు గా ఎదిగి... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కరెక్ట్ గా చెప్పాలి అంటే, తెలుగులో ఎన్టీఆర్ తప్ప మిగతా ఎవరూ పాలిటిక్స్ లో తమ ప్రాభవం చూపించలేకపోయారు. మెగాస్టార్ గా టాలీవుడ్ ని శాసించిన చిరంజీవికి సైతం రాజకీయంలో ఉన్న కిటుకులు అర్ధం కాక ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, తిరిగి సినిమాల్లో తన సత్తా చాటడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు.

 

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఖాళీగా ఉన్న నెంబర్ వన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు అనుకున్న సమయంలో, సినిమాలకి గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగు పెడతానని అనౌన్స్ చేసాడు పవన్ కళ్యాణ్. జన సేన పార్టీ పెట్టిన మొదట్లో యువతని తన వైపు తిప్పుకొని 2014 ఎలక్షన్స్ లో టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నయానో భయానో ప్రభుత్వం కొన్ని విషయాల్లో తన నిర్ణయాల్ని అమలు చేసే విషయంలో గెలుపు సాధించాడు. కానీ, గత సంవత్సర కాలం నుండి పవన్ కళ్యాణ్ కన్ఫ్యుజింగ్ స్టేట్మెంట్స్ తో సొంత జన సేన పార్టీ కార్యకర్తల్ని సైతం అయోమయంలోకి నెట్టాడు.

 

ఇవన్నీ ఒక ఎత్తయితే, అజ్ఞాతవాసి ఫ్లాప్ రిజల్ట్ మరొక ఎత్తు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కి ఇది మింగుడుపడని వ్యవహారంగా మిగిలింది. ఒక సంవత్సరంలో అటు ఇటుగా ఎలక్షన్స్ ఎప్పుడయినా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సినిమాలు చేస్తూ వెళ్తే జనాలకి దూరం అవుతాడు... అలా అని చెప్పేసి ఒక ప్లాప్ ఇచ్చిన తర్వాత జనాల్ని పేస్ చెయ్యలేని పరిస్థితి. కంటెంట్ లేకపోవడంతో, అజ్ఞాతవాసి పై సొంత అభిమానులు కూడా పెదవి విరిచారు.

 

ఒక వైపు టీడీపీ మళ్ళీ గెలిచే ప్రయత్నంలో శాయశక్తులా కృషి చేస్తుంది. వైయస్ జగన్ కూడా పాదయాత్ర తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎటొచ్చి పవన్ కల్యాణే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాడు.

 

అజ్ఞాతవాసి ప్రమోషన్స్ లో కూడా పాల్గొనని పవన్, గత కొన్ని రోజులుగా అందరికీ దూరంగా ఉంటున్నాడు. తనకు అత్యంత సన్నిహితుల సలహాలు తీసుకొని ఏం చేయాలి అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నాడని సమాచారం. ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా, అది తన రాజకీయ భవితవ్యం పై తీవ్రమయిన ప్రభావం చూపిస్తుంది కాబట్టి... తొందరపడటం కన్నా కూడా కొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉండి, గట్టి ప్రణాళికతో ముందుకు రావాలని అనుకుంటున్నాడట.

 

ఇప్పటికే దారులన్నీ మూసుకుపోయాయి, మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తాడో చూడాలి!