జనం సొమ్ముతో జల్సాలు.. జగన్ ప్యాలెస్ లో బంగారంతో చేసిన కుర్చీలు!

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క‌సారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయ‌న‌కు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా..  తెలుగు మీడియాతో మాట్లాడ‌ట‌మా అన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా నిత్యం కాక‌పోయినా  తరచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి,  సంక్షేమ ప‌థ‌కాల‌పై వివ‌రిస్తుంటారు. కానీ  జ‌గ‌న్ మాత్రం త‌న ఐదేళ్ల పాల‌న‌లో ఒక్క‌సారంటే ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే చిన్న‌చూపు   అన్నది పక్కన పెడితే.. మీడియా వాళ్లు ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతారోన‌న్న భ‌యం ఆయనను  తెలుగు మీడియా దూరంగా ఉంచడానికి కారణమని వైసీపీ నేతలే చెబుతుంటారు.  తాజాగా ఎన్నిక‌ల వేళ తప్పనిసరి పరిస్థితులలో  జ‌గ‌న్ ఓ తెలుగు ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. జగన్ ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి జ‌గ‌న్ కు ఇబ్బంది క‌లిగించే ప్ర‌శ్న‌ ఒక్కటి కూడా వేయకుండా  చాలా జాగ్రత్త పడ్డాడు.  జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌గ‌లిగే ప్ర‌శ్న‌ల‌తోనే ఆ ఇంట‌ర్వ్యూ సాగింది. ఇంట‌ర్వ్యూ జ‌రిగిన విధానం అలా  ఉంచితే.. ఇ ఇంట‌ర్వ్యూ సందర్భంగా జ‌గ‌న్ , స‌ద‌రు టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీలు ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  

తాడేప‌ల్లిలోని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్యాలెస్‌లోనే ఇంట‌ర్వ్యూ జరిగిందని అంటున్నారు. ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, టీవీ ఛానెల్ ప్ర‌తినిధి కూర్చున్న కుర్చీల‌ను చూసి తెలుగు ప్ర‌జ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. జ‌గ‌న్ ధ‌న‌వంతుడ‌ని అంద‌రికీ తెలుసు.. దేశంలోని రాష్ట్రాల సీఎంల‌లో అత్యంత ధ‌న‌వంతుడు జ‌గ‌న్ అని జాతీయ మీడియాలోనూ గతంలోనే క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, జ‌గ‌న్ వ‌ద్ద సొమ్మంతా అవినీతి, అక్ర‌మాల‌తో, దొడ్డిదారిన సంపాదించిందేన‌న్న విమర్శలూ ఉన్నాయి. అక్రమాస్తుల కేసులోనే  జ‌గ‌న్ జైలుకు సైతం వెళ్లొచ్చారు. ల‌క్ష‌ల కోట్లు సంపాద‌న క‌లిగిన వారి ఇళ్ల‌లోనైనా బంగారం పూత‌తోచేసిన కుర్చీలు చాలా అరుదు. రాజుల కాలంలో బంగారం పూత‌తో కూడిన‌ కుర్చీలు ఉండేవ‌ని పుస్త‌కాల్లో చ‌దువుకోవ‌ట‌మే త‌ప్ప వాటిని చూసిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కుర్చీలకు, బంగారపు తొడుగు వేసిన సింహాలు క‌నిపించాయి. వీటిని చూసిన తెలుగు ప్ర‌జ‌లు షాక్ అవుతున్నారు. ఒక్కో కుర్చీకి రెండు బంగార‌పు సింహాలు ఉన్నాయి. దాదాపు ఒక్కో సింహం కేజీ బంగారంతో చేసిన‌ట్లు తెలుస్తోంది. జగన్ అవినీతి సొమ్ముతో తన ఇంట్లో బంగారపు కుర్చీలు చేయించుకున్నారని  ఆయ‌న చెల్లెలు వైఎస్‌ షర్మిల ఇటీవ‌లి కాలంలో  చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆమె మాటలను జనం న‌మ్మ‌లేదు. ప్ర‌స్తుతం బంగారం కుర్చీల‌కు సంబంధించిన ఫోటోలు బయట పడటంతో అందరూ షాక్ అవుతున్నారు.
 
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్రంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు అక్ర‌మంగా సంపాదించార‌న్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఇసుక‌, మ‌ట్టి మాఫియాతోపాటు, గంజాయి అక్ర‌మ ర‌వాణా, మ‌ద్యం మాఫియాతో జ‌గ‌న్, ఆయ‌న అనుచ‌రులు ల‌క్ష‌ల కోట్లు ప్ర‌జ‌ల సొమ్మును జేబులో వేసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  తాజాగా లాండ్ టైట్లింగ్  యాక్ట్ తో ప్ర‌జ‌ల సొమ్మును త‌న సొమ్ముగా మార్చుకునేందుకు జ‌గ‌న్ కుట్ర చేశారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక ప్ర‌జా సొమ్ముతో ప్ర‌ముఖ న‌గ‌రాల్లో విలాస‌వంత‌మైన భ‌వ‌నాలు, ఆ భ‌వ‌నాల్లో బంగార‌పు కుర్చీలు చేయించుకుంటున్న జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేను, నా అభ్య‌ర్థులు పేద‌వాళ్లం, డ‌బ్బు లేదు.. అప్పుల్లో ఉన్నారంటూ బ‌హిరంగంగా ఎలా చెప్పగలుగుతున్నారని జనం విస్తుపోతున్నారు.  

మ‌రోవైపు దేశంలోనే ధ‌నిక ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రైన  జ‌గ‌న్.. ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో మాత్రం.. ఈ ఎన్నిక‌లు పేద‌ల‌కు, ధ‌నికుల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.   ప్ర‌జ‌లంతా పిచ్చోళ్లు.. తాను ఏది చెప్పినా వింటారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో  డ‌బ్బులు పంచేస్తే ఓట్లు వేస్తార‌ని జ‌గ‌న్, వైసీపీ నేత‌లు ఫిక్స్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నది.  ప్ర‌జ‌ల ప‌ట్ల‌ జ‌గ‌న్‌, వైసీపీ అభ్య‌ర్థుల దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలివేయాలంటే మే13న జ‌రిగే పోలింగ్ లో ఓటును ఆయుధంగా మార్చాల్సిందే. ఇప్ప‌టికే   ఏపీలోని మెజార్టీ ప్ర‌జ‌లు.. ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం తెలుగుదేశం కూటమికి పోటెత్తుతున్న జనాలను, డజనుకు పైగా సర్వేల ఫలితాలను చూస్తే అర్ధమైపోతుంది.