పవన్ పర్యటిస్తే జగన్‌కెందుకు దడ?

 

“అధికారం కోసం కాదు కేవలం ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చేనని” జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. అంతే కాదు తాను తెదేపా, బీజేపీలకు బేషరతుగా మద్దతు ఇచ్చినప్పటికీ అవసరమయితే వాటినీ ప్రజల తరపున నిలబడి నిలదీస్తానని ఆనాడే చెప్పారు. చెప్పినట్లే ఆయన రాజధాని భూసేకరణ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అరకొర బడ్జెట్ కేటాయింపులపై ప్రశ్నించారు. అంతటితో తన పనయిపోయిందని చేతులు దులుపుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంటికి వెళ్లి ఆయనని భూసేకరణ గురించి అడిగారు. అయన ఏమని సమాధానం చెప్పారో తెలియదు గానీ తనే స్వయంగా తుళ్ళూరు వెళ్లి భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొనేందుకు సిద్దం అయినట్లు సమాచారం.

 

ఈ సంగతి తెలియగానే అందరి కంటే ముందుగా వైకాపా ఉలికి పడింది. ఆ తరువాత చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టింది. ఆయన పర్యటనకు వక్రభాష్యాలు చెప్పడం మొదలుపెట్టేసింది. అసలు ఇదంతా పెద్ద కుట్రగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే రాజధాని భూసేకరణ కార్యక్రమం మొదలయినప్పటి నుండి ఆ పార్టీ స్థానిక రైతులను రెచ్చగొడుతూ ఆ ప్రక్రియకు అవరోధాలు కల్పించేందుకు తను చేయగలిగినంతా చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా భూసమీకరణను అడ్డుకోలేకపోయింది. వైకాపా సృష్టించిన ఆ అవరోధాలన్నిటినీ అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలిగింది.

 

ఇక మిగిలిందల్లా అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల భూములను సర్వే జరిపించి స్వాధీనం చేసుకోవడమే. ఆ కార్యక్రమం మరొక వారం పది రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకొంది. ఈ సమయంలో రైతులు సహజంగానే తీవ్ర భావోద్వేగాలకు లోనయి ఉంటారు. కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రేపు తుళ్ళూరు మండలంలో పర్యటించి భూసమీకరణ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు చివరి ప్రయత్నం చేయాలనుకొన్నారు. కానీ ఇదే సమయంలో తెదేపాకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారని తెలిసి వైకాపా ఆందోళన చెందడం సహజం. అందుకే పవన్ కళ్యాణ్ తుళ్ళూరు పర్యటన గురించి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడక ముందే, దాని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ప్రచారం మొదలుపెట్టేసింది.

 

కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలవక ముందు రోజు “రైతుల ప్రయోజనాలను, పంట భూములను, పంటలను ప్రభుత్వమే కాపాడాలి. రైతుల ఉసురు తగిలితే అది ఎవరికీ మంచిది కాదు,” అని ట్వీటర్ మెసేజ్ పెట్టారు. అంటే ఆయన కూడా ఈ భూసేకరణ పట్ల అయిష్థత కలిగి ఉన్నారని స్పష్టమవుతోంది. ఆయన ఆ సందేశం పెట్టిన తరువాతనే రెండు గ్రామాల రైతులు జనసేన జెండాలు, బ్యానర్లు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. వారిని పవన్ కళ్యాణే వెనక నుండి ప్రోత్సహించారని వైకాపా ఊహాజనితమయిన కధనాలు ప్రచారం చేయడం చాలా దారుణం. ఈ విధంగా రైతుల ధర్నాల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని, అతని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నరంటూ లేనిపోని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉన్నత వ్యక్తిత్వం గురించి తెలిసిన వారెవరూ కూడా ఇటువంటి ఆరోపణలు, కట్టు కధలు జీర్ణించుకోవడం కష్టం.

 

అసలు ఆయన పర్యటనకు కేవలం వైకాపా మాత్రమే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తోంది? ఎందుకు కంగారు పడుతోంది? ఆయన అసలు బయలు దేరుతున్నారో లేదో కూడా తెలియక ముందే ఇలా బోడి గుండుకి మొకాలుకి ముదేస్తూ ఎందుకు ప్రచారం చేస్తోంది? ఆయన రైతులను ఒప్పించినా లేక వారితో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడదలచుకొన్నా వైకాపాకి ఏమిటి అభ్యంతరం? ఏమిటి కష్టం? రైతుల తరపున నిలబడి పోరాడుతున్నాని వైకాపా చెప్పుకొంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలిస్తే ఆయనను ఆహ్వానించకపోగా ఎందుకు ఆందోళన చెందుతోంది? అని ప్రశ్నించుకొంటే ఈ భూసేకరణ అంశాన్ని వైకాపా ఎందుకు ఉపయోగించుకొంటోందో, దాని ఉద్దేశ్యాలు ఏమిటో అర్ధం అవుతాయి.

 

భూసమీకరణ వల్ల రైతులకు ఎటువంటి నష్టమూ కలగకుండా తను హామీ ఉంటానని పవన్ కళ్యాణ్ రైతులకు నచ్చజెప్పి ఒప్పించేస్తే, అప్పుడు వైకాపా ఇంతకాలంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. లేదా ఆయన ఆఖరి నిమిషంలో ప్రవేశించి తను మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని దొరకబుచ్చుకొని మొత్తం క్రెడిట్ అంతా స్వంతం చేసేసుకొంటారనే భయం వల్ల కావచ్చును. రైతుల తరపున పోరాడుతున్నామని చెపుతూ రైతులను మభ్య పెడుతూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు దీనినే ఆయుధంగా చేసుకొని తన రాజకీయ ప్రతర్ది అయిన అధికార తెదేపాను అప్రతిష్టపాలు చేయాలని వైకాపా తహతహలాడుతోంది. అందుకే ఇటువంటి సమయంలో అందరూ అభిమానించే పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో పర్యటించబోతున్నారనే వార్త వినబడగానే కంగారు పడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా అప్పుడే చెడు ప్రచారం ఆరంభించేసింది. ఈవిధంగా ప్రతీ అంశాన్ని కూడా రాజకీయం చేయడం వలననే వైకాపా ప్రజల విశ్వాసం పొందలేకపోతోంది. మరి ఈ విషయం ఎప్పటికయినా గ్రహిస్తుందో లేదో?