జగన్ అవసరం జనానికి లేదని చాటుతున్న పవన్!

తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన పోలీసుల పని తీరుపై చేసిన వ్యాఖ్యలు, అధికారుల సమన్వయలోపాన్ని ఎత్తి చూపిన తీరు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్ఠించాయి. సామాన్య జనం పవన్ మాటలు సూటిగా, నిర్మొహమాటంగా, నిష్కర్షగా ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీయులు మాత్రం పవన్ వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. కూటమి పార్టీల మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఇదే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు పవన్  కల్యాణ్ ఏ సందర్భంలో పోలీసుల వైఫల్యం, అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారన్నది గమనిస్తే.. వైసీపీయుల వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ రాజకీయలబ్ధి కోసం పడుతున్న వెంపర్లాటలో భాగమే అని ఇట్టే అవగతమౌతుంది. 

పవన్ కల్యాణ్ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే.. ఏపీలో ప్రతిపక్షం లేదు. విపక్షంగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పటికీ వారెవరూఅసెంబ్లీకి రావడం లేదు. ప్రజలు తిరస్కరించినా సరే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నఅసంబద్ధ డిమాండ్ తో అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో విమర్శలు, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే... ప్రభుత్వంపై నాలుగు రాళ్లేసి ముఖం చాటేయడం వినా ఆ పార్టీకి మరో యాక్టివిటీ కనిపించదు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తినప్పుడు కానీ, ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట విషద సమయంలో కానీ ఆ పార్టీ రాజకీయం చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యత బాధితులకు స్వాంతన కలిగేలా వ్యవహరించడానికి ఇవ్వలేదు. శవ రాజకీయాల కోసం మాత్రమే ఆ పార్టీ అధినేత కానీ, నాయకులు కానీ బయటకు వస్తున్నారు. మీడియా ముందు మాట్లాడుతున్నారు. 

ఇక్కడే పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారుల సమన్వయ లోపం, టీటీడీ వీఐపీ యాటిట్యూడ్ పై వ్యాఖ్యలు చేశారు. అంతే రాష్ట్రంలో ప్రతిపక్షం లేని లోటును పూడ్చేందుకు తాను ఉన్నానని చాటారు. ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి కూడా పొరపాట్లను ఎత్తి చూపారు. సరిదిద్దుకోవాలన్నారు. సరిదిద్దు కుంటామని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితులకు, వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. ప్రతిపక్షం లేదు అన్న ప్రజలలో కలగకుండా.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్న సంకేతాన్ని పవన్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. స్వపక్షంలోనే విపక్షంగా ఉంటామని ఆయన కూటమి ఎన్నికలలో  తిరుగులేని విజయం సాధించిన నాడే చాటారు. ఆయన ప్రకటనను అప్పట్లో చంద్రబాబు కూడా చాటారు. ప్రభుత్వంలో ఉన్నా కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన గళమెత్తుతుందనడానికి గతంలోనే ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. 2014 ఎన్నికలలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. అప్పడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలే అప్పట్లో మంత్రులను అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల విషయంలో స్పందిచడానికి స్వపర బేధం ఉండదని చాటారు.  

ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత లేకున్నా ఆ హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ ఈ ఆర్నెళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనైనా చేశారా? అంటే లేదు.    ప్రభుత్వానికి ఇప్పటి వరకూ నిర్మాణాత్మక సూచన చేసిన ఉదంతం లేదు. ఇదీ ప్రభుత్వ వైఫల్యం అని ఎత్తి చూపిన ఒక్క సందర్భం లేదు. అసలు ఒక రాజకీయ పార్టీగా వైసీపీకి, ఆ పార్టీ నాయకుడిగా జగన్ కు ఒక దిశదశ ఉన్నట్లు కనిపించదు.  ఈ పరిస్థితులతో తామే ప్రతిపక్షంగా ఉంటామని కూటమిలోని పార్టీలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు. విమర్శలు. ఇది స్వాగతించాల్సిన అంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్  ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. మా ప్రభుత్వం తప్పు చేసినా ఎత్తి చూపుతాననీ, సరిదిద్దుకునేలా చేస్తానని అంటున్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేముందని పరిశీలకులు అంటు న్నారు.   అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన గట్టిగా ప్రశ్నించారు.  బాధితులకు భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షం చేతకాని తనాన్ని గుర్తించి.. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు.  దీనిని స్వాగతించే సంస్కారం వైసీపీకి లేదు. కనీసం  చూసి నేర్చుకోవడానికైనా ప్రయత్నిస్తే మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu