కరవుతో పాక్ విలవిల.. స్వయంకృతాపరాధమేగా?
posted on Jun 3, 2025 9:23AM

పాకిస్థాన్ నీటి కొరతతో విలవిలలాడుతోంది. ఇంత కాలంగా జలవనరుల విషయంలో భారత్ ఉదారతపై ఆధారపడి ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు అండదండలు అందిస్తూ భారత్ లో హింసను ప్రేరేపిస్తూ వచ్చింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఇక అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ సైనిక పాటవానికి ఆయువుపట్టులాంటి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆ దేశ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను సైతం లేపేసింది. అంతే కాకుండా సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగింది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు నీటి కొరతతో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించిన సమయంలో అదే జరిగితే నదిలో పారేది నీరు కాదు నెత్తురు అంటూ ప్రగల్భాలు పలగిన పాకిస్థాన్ ఇప్పుడు నీటి చుక్కకోసం అల్లల్లాడాల్సిన పరిస్థితిలో పడింది. ఇప్పుడు పాకిస్థాన్ లో తాగునీరు, సాగునీరు కోసం వెంపర్లడాల్సిన పరిస్థితి ఉంది. ఆ దేశ వ్యవసాయరంగం కుదేలైంది. ప్రధానంగా మంగ్లా, తర్బేలా డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి.
ఇప్పటికే పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పాకిస్థాన్ ఐఆర్‌ఎస్‌ఏ తాజా నివేదిక ప్రకారం, మొత్తం ప్రవాహంలో 21 శాతం నీటి కొరత ఏర్పడింది. రెండు ప్రధాన డ్యామ్‌లైన మంగ్లా, తర్బేలాలలో ప్రవాహ శాతం 50 శాతం వరకూ పడిపోయింది. ఇది వేసవి పంటల సాగుపై అత్యంత తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. చీనాబ్ నదిలో ప్రవాహం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారు. న్యూయార్క్ వేదికగా జరిగిన హిమానీనదాల సదస్సులో మాట్లాడిన ఆయన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిం చిందని ఆక్రోశం వెలిబుచ్చారు. అయితే ఆయన ఆరోపణలను, ఆక్రోశాన్ని భారత్ సమర్ధంగా తిప్పి కొట్టింది. వాస్తవానికి ఒప్పందాన్ని ఉల్లంఘించినది పాకిస్థానే అని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తూ.. ఒప్పందానికి నైతికత లేకుండా చేసిందని ఘాటుగా రిటార్డ్ ఇచ్చింది. ఉగ్రవాదానికి తోడ్పాటు నిచ్చి, ఉగ్రవాదులకు రక్షణఏ కవచంగా నిలిచినందుకు పాకిస్థాన్ ఇప్పుడు మూల్యం చెల్లించు కుంటోందన్న భావన ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.