పది మంది మంత్రులకు పదవీ గండం?

 ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది  అంటే ఇదే నేమో.. ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు అధికార వైసీపీకి కొర్రుకాల్చి వాత పెట్టారు. గట్టిగా మొట్టి కాయలు వేశారు. మీటలు నొక్కి , వై నాట్  175? అని మురిసి పోతున్న అహంకారానికి కళ్లెం వేశారు. మూడు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగితే, మూడింటికి మూడు నియోజక వర్గాల్లోనూ అధికార పార్టీ   అభ్యర్ధులను పట్టభద్రులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క ఛాన్స్  ముఖ్యమంత్రికి చుక్కలు చూపించారు.

 అధికార పార్టీ   అభ్యర్ధులు ఓడిపోతే ఓడి పోయారు, ఏ స్వతంత్ర అభ్యర్దులో,అధికార పార్టీ రహస్య మిత్రపక్షం, బీజేపీ అభ్యర్దులో గెలిచారా అంటే అదీ లేదు. నిజానికి, జగన్ రెడ్డితో అంటకాగుతున్న బీజేపీ మరింత గట్టిగా వాతలు పెట్టారు. ఏపీలో బీజేపీకి ఉనికి లేదని మరో మారు రుజువు చేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధులు విజయ కేతనం ఎగరేశారు. చివరకు ముఖ్యమంత్రి సొంత గడ్డ పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పట్టభద్రులు .. జగన్ రెడ్డికి బై ..బై  చెప్పేశారు. సహజంగానే, ఈ ఓటమి అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ప్రతికూల ఫలితాలు కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. 

నిజానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందుగానే పసిగట్టారో ఏమో కానీ, మంత్రులను మాత్రం ముందుగానే హెచ్చరించారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గంలో ఓటమి ఎదురైతే, మంత్రులపై వేటు తప్పదని, ముఖ్యమంత్రి ముందుగానే హెచ్చరించారు. అయితే ఇప్పడు ఒక ఒక్క ఉత్తరాంద్రలోనే కాదు, పశ్చిమ రాయలసీమలో, వైసీపీకి తిరుగులేదనుకున్న ఒంగోలు,నెల్లూరు,చిత్తూరు జిల్లాలోనూ  ప్రతికూల  ఫలితాలే వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరిపై వేటు వేస్తారో అని, ఓటమి ఎదురైన తొమ్మిది జిల్లాల మంత్రులు భయంతో వణికి పోతున్నారు. 

నిజానికి  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గురించి తెలిసిన వారు, ఈ ఓటమిని  జగన్ రెడ్డి జీర్ణించు కోలేరని, అదే సమయంలో ఓటమికి తనదే బాధ్యతని ఒప్పుకునే నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత హుందాతనం ఆయనలో లేవని, అందుకే ఆయన మంత్రులను బలిపశువులను చేయడం ఖాయమని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌లతో పాటుగా మొత్తం పది మంది వరకు   మంత్రుల పదవులకు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ముఖ్యంగా మీటలు నొక్కితే ఓట్లు రాలతాయనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి, గతంలోనూ తాను చేయవలసిన పని (మీటలు నొక్కడం) తాను చేస్తున్నాని, అయినా  నియోజక వర్గాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేదిలేదని హెచ్చరించిన విషయాన్ని పార్టీ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తొమ్మిది జిల్లాల్లోని మంత్రులందరికి ఉద్వాసన పలికినా  పలుకుతారని అంటున్నారు. ఆలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ విషయంలో పునరాలోచించే అవకశం లేక పోలేదని  అంటున్నారు. 

 అదలా ఉంటే ఇంచు మించుగా వందకు పైగా అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఓటరు నాడిని పట్టి ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వై నాట్ 175..? ప్రశ్నకు సరైన సంధానం ఇచ్చాయని అంటున్నారు.