ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తం
posted on Nov 17, 2014 11:07AM

ఉస్మానియా విద్యార్థులు నీతికి, నియమాలకి, మంచితనానికి, మానవత్వానికి ప్రతీకలు. న్యాయమైన కోర్కెలతో ఉద్యమాలను చేసే ఉద్యమాల సూర్యులు. సహజంగా శాంతి కాముకులు. వినయ విధేయతలతో మెలిగే చాలా మంచి విద్యార్థులు. విద్యార్థులు అంటే ఎలా వుండాలో ఉస్మానియా విద్యార్థులను చేసి దేశమంతా నేర్చుకోవాలి. అయితే ఇలాంటి శాంతి కాముకులైన విద్యార్థులను రెచ్చగొడితే మాత్రం ఫలితాలు చాలా తీవ్రంగా వుంటాయి. శాంతి దూతలు ఆగ్రహిస్తే ఫలితాలు ఎలా వుంటాయో గతంలో ఎన్నోసార్లు నిరూపణ అయింది. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ఉద్యోగ నియామక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ఉస్మానియా విద్యార్థుల, నిరుద్యోగుల ఐకాస పిలుపు ఇచ్చింది. ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు శాంతియుతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో భారీ స్థాయిలో మోహరించారు. భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఉస్మానియా విద్యార్థులకు పోలీసుల వ్యవహార శైలి ఆగ్రహం తెప్పించింది. దానికి తోడు చాలా శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని పోలీసులు అకారణంగా, నిర్దాక్షిణ్యంగా అడ్డుకోవడంతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిని అణచివేయడానికి పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం రణరంగంగా మారింది.