రైతు గెలిచాడు.. మోదీ ఓడాడు.. ప్రతిపక్షాల కౌంటర్లు..
posted on Nov 19, 2021 10:32AM
కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం. ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. రైతులు ఆందోళన విరమించండి. దేశానికి క్షమాపణలు చెబుతున్నా.. అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రతిపక్షాలు స్వాగతించాయి. ‘ఇది అన్నదాతల విజయం’ అంటూ రైతులకు శుభాకాంక్షలు తెలిపాయి.
‘‘దేశ అన్నదాతలు తమ సత్యాగ్రహంతో అహంకారాన్ని తలదించేలా చేశారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో తాను పోస్ట్ చేసిన ఓ పాత వీడియోను రీట్వీట్ చేశారు. ‘‘నా మాటలు గుర్తుపెట్టుకోండి.. ప్రభుత్వం బలవంతంగానైనా ఈ చట్టాలను రద్దు చేస్తుంది’’ అని రాహుల్ చెబుతున్న ఆ వీడియోను మరోసారి గుర్తు చేశారు.

‘‘ఈ ప్రకాశ్ దివస్ నాడు మంచి వార్త విన్నాం. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు ఫలితం దక్కింది. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. దేశ రైతులకు సెల్యూట్’’ అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
‘‘క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతులకు హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ - పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ