అసెంబ్లీలో హెరిటేజ్ టాపిక్.. చంద్రబాబు సీరియస్..
posted on Nov 19, 2021 10:46AM
రెండోరోజు అసెంబ్లీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. వ్యవసాయంపై చర్చ.. హెరిటేజ్ వైపు మళ్లింది. చర్చలో భాగంగా మంత్రి కన్నబాబు సభలో హెరిటేజ్ సంస్థ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రభుత్వ లోన్లతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు..హెరిటేజ్‌కే పాలు విక్రయించాలని గతంలో ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రైతుల గురించి మాట్లాడితే తనపై పరువు నష్టం కేసు వేశారని కన్నబాబు చెప్పారు.
కన్నబాబు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ఆరోపణలపై వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. మీకు అవకాశం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలని స్పీకర్ స్పష్టం చేశారు. అలాగే మంత్రి అప్పలరాజు స్పీచ్‌పైనా టీడీపీ అభ్యంతరం తెలిపింది. సంబంధం లేని అంశాలపై మాట్లాడేందుకు మంత్రికి అవకాశం ఎలా ఇస్తారని టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరోవైపు.. అసెంబ్లీ ప్రారంభానికి ముందు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. రైతుల ఆందోళనలను గుర్తించి చట్టాలను వెనక్కు తీసుకోవడం సముచితమన్నారు. కేంద్రం తరహాలోనే రాజధాని రైతుల ఆందోళనను ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని తెలిపారు. సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టే మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్రం వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.