ఆపరేషన్ సిందూర్.. అసలు సినిమా ముందుంది!
posted on May 8, 2025 11:35AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం, బుధవారం (మే 7) తెల్లవారు జామున మెరుపుదాడి చేసింది. ఏక కాలంలో తొమ్మది ఉగ్ర స్థావరాలపై జరిపిన ఈ దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఆరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్ భారతీయులలో ఆనందాన్ని నింపింది. ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.ఇంత కాలానికి పాకిస్థాన్ పెంచి పోషిస్తున్నఉగ్రవాదానికి శాశ్వత సమాధి కట్టే దిశగా స్థిరమైన అడుగు పడినందుకు సర్వత్రా సంతోషం వ్యకమవుతోంది.
అయితే.. ఇక్కడితో కథ ముగిసినట్లేనా అంటే కాదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. అవును.. సినిమా ఇంకా అయిపోలేదు. నిజానికి అసలు సినిమా ఇంకా మొదలే కాలేదు. ఇంతవరకు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు కథ ముందుంది. అయితే.. ఇంతలోనే పాకిస్థాన్ చేతిలేత్తేస్తే ఎత్తేసి ఉండవచ్చును. కానీ.. ఏప్రిల్ 22 న భారత మాత నుదుటి సిందురాన్ని చెరిపేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు జరిపిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం ఇంతటితో తీరేది కాదు. పసుపు పారాణి అయినా ఆరని నవవధువు, నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి సహా 26 మంది హిందూ మహిళల నుదుటి తిలకాన్ని చెరిపేసిన ఉగ్రదాడికి, ఓ వంద మంది ఉగ్రవాదులను హత మార్చడం ముగింపు కాదు. ఉగ్రవాదాన్ని,ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థాన్ ను శిక్షించే వరకు ఆపరేషన్ సిందూర్ ఆగదు.ఆగకూడదు.
ఇదే విషయాన్ని.. భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే తమదైన సైనిక భాషలో చక్కగా చెప్పారు. ఆపరేషన్ సిందూర్' పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌పై నరవణే కీలకమైన హింట్ ఇచ్చారు. సినిమా అప్పుడే అయిపోలేదు..ఇంకా ఉంది' (పిక్చర్ అభీ బాకీ హై) అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దీంతో పాక్ ఉగ్రవాదులపై మరిన్ని చర్యలు భారత ఆర్మీ ప్లానింగ్‌లో ఉన్నాయని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునే దిశగా పావులు కదపవచ్చని ఇటు నెటిజన్లు, అటు నిపుణులు ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కొద్ది రోజుల క్రితం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఆ దేశ చెర నుంచి విడిపించడం ఒక్కటే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు. సో.. తాజా పరిణామాలను గమనిస్తే, భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే చెప్పినట్లుగా పిక్చర్ అభీ బాకీ హై .. సినిమా ఇంకా వుంది. కాదు కాదు అసలు సినిమా ముందుంది.