ఆన్‌లైన్లో మ‌ద్యం అమ్మ‌కం.. లాక్‌డౌన్‌లో ప్ర‌భుత్వం పర్మిష‌న్‌..

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు అనేక రాష్ట్రాలు క‌ఠిన ఆంక్ష‌లు విధించాయి. ప‌లు స్టేట్స్ నైట్ క‌ర్ఫ్యూకే ప‌రిమిత‌మైతే.. ఇంకొన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. కేవ‌లం నిత్యావ‌స‌రాల కొనుగోళ్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్నాయి. దీంతో, బార్లు, వైన్లు, ప‌బ్బులు బంద్ అయ్యాయి. పాపం.. మందుబాబులు నాలుక త‌డారిపోయి నానా యాత‌న ప‌డుతున్నారు. మ‌ద్యానికి అల‌వాటు అయిన వాళ్లు.. మద్యం ప్రియులకు తెగ ఇబ్బందిగా ఉంది. ఎన్ని రోజులైనా లాక్‌డౌన్ పెట్టుకోండి కానీ.. రోజూ ఓ గంటైనా వైన్స్ తెర‌వండి అంటూ ప్ర‌భుత్వాల‌కు తెగ రిక్వెస్టులు పంపుతున్నారు. 

ఎట్ట‌కేల‌కు.. మందు బాబులు అభ్య‌ర్థ‌న‌ను ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం అర్థం చేసుకుంది. మద్యం ప్రియుల‌కు మందు ఎంత ముఖ్య‌మో గుర్తించింది. అయితే, వైన్ షాపులు తెరిచేందుకు మాత్రం ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు కానీ.. లాక్‌డైన్ ఉన్నంత కాలం ఆ రాష్ట్రంలో ఆన్‌లైన్లో లిక్క‌ర్ హోం డెలివ‌రీకి మాత్రం ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సోమ‌వారం నుంచే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. 

ఆన్ లైన్ లిక్కర్ ఆర్డ‌ర్ చేసేందుకు.. మ‌ద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌త్యేకంగా ఓ యాప్‌ను తయారు చేసింది. ‘సీఎస్ఎంసీఎల్’ యాప్‌లో వివరాలు న‌మోదు చేసి, ఆర్డ‌ర్ చేస్తే.. ఇంటి ద‌గ్గ‌రికే లిక్కర్‌ సరఫరా చేస్తారు. ఎంచ‌క్కా లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటూ.. ఆన్‌లైన్‌లో మందు బుక్ చేసుకుంటూ.. కావల‌సిన స‌రుకు ఇంటికే తెప్పించుకుంటూ.. మందేస్తూ.. చిందేస్తూ.. ఇంట్లోనే  మ‌జా చేసేయొచ్చు అంటున్నారు. ఐడియా భలే బాగుంది క‌దూ. అందుకే, లాక్‌డౌన్ ఉన్నా.. లేకున్నా.. ఆన్‌లైన్ లిక్క‌ర్ డెలివ‌రీని కొన‌సాగించాల‌ని అప్పుడే డిమాండ్లు మొద‌ల‌య్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్‌లో లిక్క‌ర్ డెలివ‌రీ సౌక‌ర్యం ఎప్పుడు వ‌స్తుందోన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు మందుబాబులు...