నూజివీడు మామిడికి రాతిమంగు ముప్పు

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన నూజివీడు మామిడికి ఈ ఏడాది రాతిమంగు కనిపిస్తోంది. దీనివల్ల దిగుబడి దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. నూజివీడు డివిజన్ లోని 10 మండలాల్లో సుమారు లక్షాయాభైవేల ఎకరాల్లో మామిడితోటలు ఉన్నాయి. ఇక్కడి మామిడిని దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో మ్యాంగోపల్ప్ యూనిట్లు కూడా ఉన్నాయి. అయితే ఈసారి దిగుబడికి గ్యారంటీ లేకపోవడంతో రైతులు, వ్యాపారులు, పరిశ్రమల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. డిసెంబర్ లో వచ్చిన మామిడి పూతలు జనవరి ప్రారంభంలో కురిసిన వర్షాలకు మాడిపోయాయి. సంక్రాంతిముందు ఉన్న చలి వాతావరణం వల్ల మళ్ళీ మామిడి చెట్లపై పూత కనిపించింది. వచ్చిన పూత నిలిచేందుకు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పలు రసాయన మందులు చల్లారు. పూత బాగా వచ్చినప్పటికీ పిందెలు ఏర్పడకపోవడంతో రైతుల్లో ఆందోళన ఏర్పడింది.పూతలో మగపూత ఎక్కువగా ఉండటం ఫిబ్రవరి రెండవ వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పూత పిందెగా మారకుండా మాడిపోయాయి. మిగిలిన రకాల కన్నా కలెక్టర్ (తోతాపురి) రకం మామిడి మాత్రమే కాస్త చెట్లపై కనిపిస్తోంది. మిగిలిన రకాల దిగుబడి ఈ ఏడాది 20 శాతం కూడా ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu