ఎన్టీఆర్ ఒక పేరు కాదు తెలుగుజాతి వెన్నెముక.. బాలకృష్ణ

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై హిందుపురం ఎమ్మెల్యే స్పందించారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్  పేరు మార్చడంపై బాలకృష్ణ స్పందన ఒకటి రెండు రోజులు లేటైనా చాలా లేటెస్ట్ గా ఉంది.  అబ్రాడ్ లో ఉండటం వల్ల బాలకృష్ణ సమాచార లోపం వల్లే ఆయన స్పందన ఆలస్యమైందని తెలుగుదేశం వర్గాలు, బాలకృష్ణ అభిమానులు చెబుతున్నారు.

అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ స్పందన ఒకింత లేటైందే కానీ పక్కాగా వచ్చింది. జగన్ సర్కార్ అసంబద్ధ నిర్ణయాన్ని ఖండిస్తూ బాలకృష్ణ తన ఫేస్ బుక్ లో చేసిన పోస్టు జగన్ సర్కార్ కాళ్ల కింద భూమి కంపించేలా ఉంది. నందమూరి నట సింహం, తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతినిథి స్వర్గీయ ఎన్టీఆర్ నట, రాజకీయ వారసుడు  నందమూరి బాలకృష్ణ స్పందన సీఎం జగన్ నిర్ణయంలోని అహేతుకతను, అసంబద్ధతనూ సూటిగా ఎత్తి చూపింది.  ప్రస్తుతం విదేశంలో ఉన్న బాలకృష్ణ హెల్త్ వర్సిటీ పేరు మార్పును ఖండిస్తూ తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు వెంటనే వైరల్ అయ్యింది.

‘మార్చేయడానికీ, తీసేయడానికీ  ఎన్టీఆర్ ఒక పేరు కాదు ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి  వెన్నెముక..తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్టు పేరు మార్చాడు కొడుకు గద్దెనెక్కి హెల్త్ వర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచ భూతాలున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ అంటూ బాలకృష్ణ స్పందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి  వైఎస్ హైదరాబాద్ లోని  విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును తీసేసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రం అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలై అభివృద్ధి చెందిన శంషాబాద్ విమానాశ్రయానికి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఆ తరువాత సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్టీఆర్ పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టిన సంగతి విదితమే. ఇప్పుడు బాల కృష్ణ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాడు తండ్రి విమానాశ్రయం పేరు మారిస్తే.. నేడు   కొడుకు హెల్త్ వర్సిటీ పేరు మార్చారని దుయ్యబట్టారు.

అయినా మర్చడానికీ, తీసేయడానికీ ఎన్టీఆర్ ఒక పేరు కాదని తెలుగుజాతి వెన్నెముక అనీ అన్నారు. ఆయన పేరుతో ఆటలాడుకుంటే మిమ్మల్ని తీసేయడానికి జనం ఉన్నారు, పంచభూతాలున్నాయి జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ప్ర‌జారోగ్యం  కేవలం  ప్ర‌చారాలు, ప‌థ‌కాల రూపకల్పనలకే పరిమితం చేయకుండా  ప్ర‌త్యేకించి ప్రజారోగ్యం కోసం ఒక విద్యాల‌యాన్ని స్థాపించి భవిష్యత్ తరాలకు కూడా ప్రయోజనం చూకూర్చాలన్న దార్శనిత ఎన్టీఆర్ సొంతం. దూరదృష్టే కాదు.. అసలు ప్రజారోగ్యంపైనా, ప్రజా సంక్షేమంపైనా దృష్టే లేని జగన్ సర్కార్  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ అని మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గర్హిస్తున్నారు.

చివరికి సొంత చెల్లి, వైఎస్ కుమార్తె షర్మిల కూడా జగన్ నిర్ణయాన్ని ఖండించారు. అధికార గ‌ర్వంతో చేసే ప‌నులు, తీసుకునేనిర్ణ‌యాలపే ప్ర‌జ‌లు ఆమోదించ‌ర‌న్న‌ది   జ‌గ‌న్ స‌ర్కార్ అర్ధం చేసుకో వాలి కానీ అందుకు భిన్నంగా ప్ర‌జ‌లు బుద్ధి చెప్పేవ‌ర‌కూ దుస్సాహ‌సం చేయ‌డం ద్వారా  త‌న పతనాన్ని జగన్ తానే లిఖించుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.