రేవంత్ పాదయాత్రలో సీనియర్లేరీ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు జనం ఆదరణ కనిపిస్తోంది. రోజు రోజుకూ ఆ ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ జనాదరణ వచ్చే ఎన్నికలలో ఓట్లుగా మారుతుందా? అంటే మాత్రం సానుకూల సమాధానం రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన పాదయాత్రలో కాగడా పెట్టి వెతికినా పార్టీ సీనియర్లు ఎవరూ కనిపించకపోవడమే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సహా సీనియర్లందరూ రేవంత్ పాదయాత్రకు దూరంగా ఉంటున్నారు.

యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ నేతలు  విమర్శలతో ఆయనపై మూకుమ్మడి దాడి చేస్తుంటే.. పార్టీ సీనియర్లెవరూ ఆయనకు మద్దతుగా గళం విప్పడం లేదు. రేవంత్ రెడ్డి- పార్టీ సీనియర్ల మధ్య అగాధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాక్రే వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా చెబుతున్నా.. విభేదాలు సమసిపోలేదనీ, అగాధం అలాగే ఉందనీ పరిశీలకులు అంటున్నారు.

అందుకు ఉదాహరణగా రేవంత్ పాదయాత్రనే చూపుతున్నారు. కనీసం పార్టీ కోసమైనా రేవంత్ పాదయాత్ర ప్రారంభం రోజున ఆయనతో అడుగు కలపడానికి కూడా సీనియర్లెవరూ రాలేదు. పీసీసీ సారథ్య బాధ్యతలు రేవంత్ చేపట్టిన నాటి నుంచీ కూడా రేవంత్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్నది ఒంటరి పోరాటమే. ఎంత ఒంటరి పోరు సాగించినా.. సీనియర్ల సహాయ నిరాకరణతో ఆయన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి ఎలా తీసుకురాగలుగుతారన్న సందేహం రాజకీయ వర్గాలలోనే కాదు, సామాన్య ప్రజలలోనూ కలుగుతోంది.

ఆ కారణంగానే ఆయన యాత్రకు ఆదరణ లభిస్తున్నా.. అది ఎన్నికల విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం ఔననే జవాబు రావడం లేదని పరిశీలకులు సైతం చెబుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో అధికార భారాసా పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమష్టిగా పని చేయడమే కాదు.. జాతీయ నాయకత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తోంది. బండి సంజయ్ రాష్ట్రంలో విడతల వారీగా చేసిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకులు సంపూర్ణంగా సహకారం అందిస్తే.. అన్ని విడతల ప్రారంభ, ముగింపు సభలకు పార్టీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా వంటి నాయకులు వచ్చి మద్దతు తెలిపారు. అటువంటి సహకారం రేవంత్ రెడ్డికి ఇక్కడి రాష్ట్ర నాయకుల నుంచీ, అటు పార్టీ హైకమాండ్ నుంచీ కూడా కరవైంది.