ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తొలి రోజు.. టీమ్ ఇండియాదే ఆధిపత్యం

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజు నాగ్ పూర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు తొలి రోజు టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రీలియాను  ముందు టీమ్ ఇండియా పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్ లు, ఆ తరువాత స్పిన్నర్లు జడేజా, అశ్విన్ లు తేరుకోనీయ లేదు. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. ఇక షమీ, సిరాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. స్కిప్పర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ 20 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నైట్ వాచ్ మన్ గా వచ్చిన అశ్విన్ ఇంకా ఖాతా ప్రారంభించలేదు.

రోహిత్ శర్మ 56 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే 100 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్ల ఉండటంతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించే అవకాశం ఉంది.