ఏపీలో ముందస్తు తథ్యమేనా?

నిన్న మొన్నటి దాకా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మోనార్క్ ... అధికార వైసీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం  ఉన్న మగాడు మరొకరు లేరు  అనుకున్నారు.  అయితే, గదిలో వేసి కొడితే  పిల్లి అయినా పులిలా తిరగబడుతుంది. ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోందని అంటున్నారు. అంతేకాకుండా  ఇంత కాలం పిల్లి మేడలో గంట కట్టేది ఎవరు అని ఎదురుచూసిన వైసీపీ అసమ్మతి నేతలకు, కడప నేతలు దారి చూపితే, నెల్లూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు  ఆనం రామనారాయణ రెడ్డి,  కోటం రెడ్డి, మేకపాటి  ఒకే సారి గంట కొట్టడంతో  ఇప్పుడు వైసీపీలో అస్మతి గంటలు గణగణ మోగుతున్నాయి. నిజానికి ఇంతవరకు పైకి వినిపించిన అసమ్మతి గొంతులు కొన్నే అయినా, సగం మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు లోపల లోపల కుతకుత ఉడికి పోతున్నారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. 

మరో వంక ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 నుంచి దిగివచ్చి, అత్తెసరుతో అయినా గట్టీక్కితే చాలానే నిర్ణయానికి వచ్చారని, అయన సన్నిహిత వర్గాల సమాచారంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి  నిన్న మొన్నటి వరకు తమకు టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళనతో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఇప్పడు టికెట్ వస్తుందేమో  మళ్ళీ పోటీ చేయక తప్పదేమో అని భయపడుతున్నట్లు ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు గుసగుసలు పోతున్నారు. 

ఇదలా ఉంటే  తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో మరో బాంబు పేల్చారు. అసమ్మతికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అయితే  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనీ,  టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామన్నారు. ముందస్తు ఎన్నికల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. టీడీపీ వ్యూహకమిటీ సమావేశంలో కూడా ఎన్నికలకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అలాగే  ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి, ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాదరణ, పవన్‌ బస్సు యాత్రతో భయం మొదలైందన్నారు. అందుకే జగన్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. 

ప్రజల్లో తన గ్రాఫ్ పడిపోయిందనే  ముఖ్యమంత్రి పల్లె నిద్రలు, బస్సు యాత్రల పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్‌‌సీపీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందన్నారు. ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్న జగన్ ఉద్దేశానికి అనుగుణంగానే టీడీపీ ముందుకు వెళ్లనుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి ప్రభుత్వం వచ్చేసిందన్నారు. మార్చి బడ్జెట్ ఇచ్చే వెసులు బాటుతో 3, 4నెలలు కాలయాపన చేశాక జూలై నాటికి ప్రభుత్వం చేతులెత్తేయడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

ఆగస్ట్ , సెప్టెంబర్లో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలానే జగన్ గ్రాఫ్ చాలా వేగంగా పడిపోయిందని.. ఇటీవలే కొన్ని సర్వేలు కూడా వచ్చాయన్నారు. తన గ్రాఫ్ పూర్తిగా సున్నాకు పడిపోక ముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసులతో లోకేష్ పాదయాత్రను, చంద్రబాబుని అడ్డుకోవాలని చూస్తున్నా.. వారిసభలు, సమావేశాలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. మరోవైపు జనాన్ని బలవంతంగా తరలించినా, అంగన్ వాడీ డ్వాక్రా సిబ్బందితో ప్రజల్ని భయపెట్టి తీసుకొచ్చినా ముఖ్యమంత్రి సభలు వెలవెలబోతున్నాయన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే...  టీడీపీ అన్ని స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. టీడీపీ తరుపున క్రియాశీలంగా పనిచేసే క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు, మండల నేతలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో ప్రజల్ని పోలింగ్ బూత్‌ల దగ్గరకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించబోతున్నామన్నారు. జగన్ ఇచ్చే సొమ్ము కోసం ఆశపడి ఎన్నికల్లో నిలవడానికి ముందుకొచ్చేవారుంటారు తప్ప..  కచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో వచ్చేవారు ఉండరన్నారు.

ముఖ్యమంత్రి పల్లెనిద్రలతో పల్లెలు మేల్కొని, ప్రజలంతా ఆయన్ని నిలదీసి, నిగ్గదీసి  తరిమితరిమి కొట్టడం ఖాయమన్నారు. అయితే ముందస్తుకు వెళ్ళినా ఓటమి తధ్యమని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి ముందస్తుకు ఎందుకు వెళతారని కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ, ముందస్తుకు వెళితే కొంత గౌరవప్రదమైన ఓటమితో సరిపెట్టుకోవచ్చని, చివరి వరకు ఆగి ఎన్నికలకు వెళితే చివరకు మిగిలేది .. సున్నా.. అని సర్వేలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి ముందస్తు వైపు మొగ్గు చూపుతున్నట్లు చెపుతున్నారు.