ప్రత్యేక హోదాను మరిచిపోవాలన్న కేంద్రం.. జగనన్న చేసేనా పోరాటం?

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంత కీలక అంశం. విభజనతో నష్టపోయిన ఆంధ్రాకి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందన్నది అందరి మాట. విభజన చట్టంలోనూ  ఏపీకి ప్రత్యేక హోదా  అంశం ఉంది. కాని ఏడున్నర ఏండ్లు అవుతున్నా ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయింది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను సాధిస్తామనే హామీతోనే ఎన్నికల ప్రచారం చేసింది. గెలిచి అధికారం చేపట్టింది. కాని హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది లేదు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడటం లేదు వైసీపీ ఎంపీలు. తన కేసుల కోసం కేంద్రానికి ప్రత్యేక హోదాను జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తాజాగా ప్రత్యేక హోదాపై మరో షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని స్పష్టం చేశారు.  

విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి  చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు నిత్యానందరాయ్. 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుందని నిత్యానందరాయ్‌ తెలిపారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానంలో  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.