జగనన్న పోరాటంలో పస లేదు!
posted on Jul 22, 2024 4:15PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఐదేళ్లు అధకారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ విధాలా భ్రష్ఠపట్టించిన జగన్ తన హయాంలో జరిగిన హత్యల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని దుయ్యబట్టింది. ఇప్పుడు వ్యక్తిగత కక్షలలో వినుకొండలో జరిగిన ఒక హత్య ఉదంతంపై తన రాజకీయ లబ్ధి కోసం నానా యాగీ చేస్తున్నారని విమర్శించింది. వినుకొండ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి కోసం జగన్ నేల విడిచి సాము చేస్తున్నారు. చివరికి సొంత పార్టీ నేతలు సైతం జగన్ తీరును తప్పుపడుతున్నారు. హస్తినలో ధర్నా ఏ ముఖం పెట్టుకు చేస్తారని అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు, వేధింపు చర్యలకే పరిమితమైన జగన్ ఇప్పడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం నవ్వు పుట్టిస్తోందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల సోమవారం(జులై 22) విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని ఏనాడూ డిమాండ్ చేయని జగన్ ఇప్పుడు వినుకొండలో ఒక రౌడీ హత్యను రాజకీయం చేస్తూ హస్తినలో ధర్నా చేస్తానంటున్నారని విమర్శించారు. తానేమీ వైసీపీ, తెలుగుదేశం అనుకూల మీడియా వార్తలను చూసి మాట్లాడటం లేదనీ, క్షేత్ర స్థాయి నుంచి తమకు అందిన సమాచారం మేరకు వినుకొండలో జరిగిన హత్య వెనుక ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని షర్మిల కుండబద్దలు కొట్టేశారు. హంతకుడు, హతుడూ ఇద్దరూ కూడా వైసీపీకి చెందిన వారేననీ, వారి మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినలో ధర్నాఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత రాజకీయ ఉనికి కోసం వినుకొండ హత్యను వాడుకుంటున్నారని షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హస్తినలో గళమెత్తని జగన్ ఇప్పుడు వినుకొండ హత్యను రాజకీయం చేయడం కోసం హస్తినలో ధర్నా చేయడానికి సిద్ధమైపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి అసెంబ్లీలో ఆయనతో సహా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే జగన్ హస్తినలో ధర్నా అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి హాజరై వివిధ బిల్లులు, ఇతర అంశాలపై మాట్లాడాల్సిన జగన్ అసెంబ్లీకి మొహం చాటేయడానికే హస్తిన పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తన హయాంలో జరిగిన తప్పిదాలకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.