సిట్ పై నమ్మకం లేదు.. బండి సంజయ్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పై తమకు ఇసుమంతైనా నమ్మకం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే కేసులో శుక్రవారం (ఆగస్టు 8) సిట్ ముందు హాజరు కావడానికి ముందు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం (ఆగస్టు 7) బండి సంజయ్ తో కేంద్ర హోంశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత బండి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  కాగా సిట్ విచారణకు హాజరు కావడానికి ముందు ఆయన ఆయన ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందజేస్తానన్న ఆయన  బీఆర్ఎస్  హయాంలో తన ఫోన్‌నే ఎక్కువగా ట్యాప్ చేశారన్నారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నా, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య దోస్తీ కారణంగా  కేసీఆర్ కుటుంబంలో  ఏ ఒక్కరినీ ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. అందుకే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదనీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu