దేశం ఉలిక్కిపడి ఏడేళ్లు దాటింది... నిర్భయ దోషులకు మిగిలింది కొన్ని గంటలే...

2012 డిసెంబర్ 16న భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున వైద్య విద్యార్ధిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం పాల్పడ్డారు. అంతేకాదు, నిర్భయ ప్రైవేట్ పార్ట్స్ లో తుప్పుపట్టిన ఇనుప రాడ్డును పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఢిల్లీ నడిబొడ్డున ప్రధాన రహదారిపై నడుస్తున్న బస్సులో నిర్భయపై ఇష్టానుసారంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి జీవచ్ఛవంగా మారిన వైద్య విద్యార్ధినిని రోడ్డుపక్కన విసిరేశారు. అలా, మృగాళ్ల చేతిలో దేహమంతా ఛిద్రమై నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిచిన నిర్భయ ఉదంతంపై దేశమంతా భగ్గుమంది.

అయితే, ఈ దారుణ సంఘటన జరిగి ఏడేళ్లు దాటిపోయింది. కానీ, దోషులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. అయితే, ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత దోషులకు మరణశిక్ష విధించినా... రకరకాల కారణాలతో ఉరిశిక్ష అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ, ఇక టైమ్ దగ్గరకొచ్చింది. నిర్భయ దోషులకు... ఇంకా, కొన్ని గంటలే మిగిలాయ్. ఈసారి ఎలాంటి అడ్డంకులు రాకపోతే ...ఫిబ్రవరి ఒకటిన నలుగురు దోషులను... ఒకే ఉరికంబంపై... ఒకేసారి... ఒకే సమయంలో... ఉరితీయనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తిచేసిన తీహార్ జైలు అధికారులు.... నిర్భయ దోషుల కోసం ప్రత్యేక ఉరికంబాన్ని సిద్ధం చేయించారు. 

నిజానికి, జనవరి 22నే నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉండగా... దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీంను ఆశ్రయించడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఇప్పుడు, మరోసారి ముఖేష్... సుప్రీంలో రిట్ పిటిషన్ వేయడంతో ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. అయితే, ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోతే... నిర్భయ దోషులైన... వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, పవన్‌లను... ఫిబ్రవరి ఒకటిన ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో ఒకే ఉరికంబంపై ఒకేసారి ఒకే సమయంలో ఉరితీయనున్నారు.