మండలి రద్దు అయితే తాము దురదృష్టవంతులమే అని భావిస్తున్న మండలి సభ్యులు...

మండలి రద్దు ప్రక్రియ ఇంకా పూర్తి కాకున్నా, పరిణామాలు ఎటు దారి తీస్తుందో ఇప్పుడే చెప్పకున్నా ప్రస్తుతం సభ్యులుగా ఉన్న 55 మంది మాత్రం తమ పదవులు కోల్పోతారనే భావనతో ఉన్నారు. తమను తాము దురదృష్టవంతులుగా భావించుకుంటున్నారు. ప్రస్తుతం శాసన మండలిలో ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58. అయితే మూడు ఖాళీలు ఉండటంతో ప్రస్తుతం 55 మంది సభ్యులున్నారు. వచ్చే నెల రెండవ తేదీ (ఫిబ్రవరి 2) నుంచి మొదలుకొని 2025 సంవత్సరం మార్చి వరకు విడతల వారీగా ఈ సభ్యులు రిటైర్ కావాల్సి ఉంది. అతి తక్కువ కాలంలో రిటైరయ్యే సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే 2025వ సంవత్సరం వరకూ గడువు ఉన్న సభ్యులు మాత్రం ఇదెక్కడి గొడవరా అంటూ నిట్టూరుస్తున్నారు. వీరిలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కాబోతున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వచ్చే నెల రెండవ (ఫిబ్రవరి 2) తేదీన ఇద్దరు సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఈ రెండు స్థానాలూ గవర్నర్ కోటాలోనే ఉన్నాయి. వీరిలో ఒకరు కంతేటి సత్యనారాయణ రాజు అయితే మరొకరు టి రత్నాభాయి. వీరిలో కంతేటి సత్యనారాయణ రాజు మండలి పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. అటువంటి కంతేటి రాజు మండలి రద్దు ప్రతిపాదన సమయంలోనూ ఉండటాన్ని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 

ఇక 2021 ఏడాదికి రిటైరయ్యే సభ్యుల జాబితా పెద్దదిగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎనిమిది మంది ఉన్నారు, వీరిలో టిడిపి నుంచి ప్రస్తుత మండలి ఛైర్మన్ షరీఫ్ మొదలుకొని తిప్పేస్వామి, సంధ్యారాణి, వీవీవీ చౌదరి వంటి నలుగురు సభ్యులు ఉంటే వైసీపీ నుంచి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇటీవలె మండలి లోకొచ్చిన ఇక్బాల్ దేవసాని చిన్న గోవిందరెడ్డి ఉన్నారు అలాగే బిజెపి నుంచి సోము వీర్రాజు ఉన్నారు. హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఇక్బాల్ కు మండలిలో స్థానం కల్పించి చట్ట సభల్లోకి ప్రవేశం కల్పించింది వైసీపీ. ఇప్పుడాయన చట్టసభల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం కానుంది. ఇక స్థానిక సంస్ధల కోటా నుంచి 2021 ఏడాదిలో రిటైరయ్యే సభ్యుల సంఖ్య పదకొండు మంది అయితే వీటిల్లో అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే తొమ్మిది మంది సభ్యులు రిటైర్ కానున్నారు, వీరిలో టిడిపి నుంచి డిప్యూటీ చైర్మన్, రెడ్డి సుబ్రహ్మణ్యం సహా వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, బుద్దా వెంకన్న, ద్వారంపూడి జగదీష్, బుద్ద నాగదీశ్వరరావులు ఉన్నారు. ఇక వైసీపీ నుంచి మండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు. వీరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు చనిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఆయన సతీమణి గాలి సరస్వతీకి కట్టబెట్టింది టిడిపి. ఇక టీచర్ ల కోటా నుంచి ఇద్దరు, గవర్నర్ కోటా నుంచి నలుగురు రిటైర్ కాబోతున్నారు. 2021 తరువాత తిరిగి 2023 ఏడాది లో ఇంకొందరు రిటైర్ కానున్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఏడుగురు ఉంటే వారిలో టిడిపి నుంచి నలుగురు వైసీపీ నుంచి ముగ్గురు ఉన్నారు. టిడిపి నుంచి రిటైరయ్యే వారిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ 2023 లో రిటైర్ కావాల్సి ఉంది. 

లోకేష్ తో పాటు బచ్చుల అర్జునుడు, మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత ఉన్నారు. వీరిలో మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, పోతుల సునీత పార్టీ మారారు. ఇక వైసీపీ నుంచి రిటైరయ్యే వారిలో మంత్రి మోపిదేవి, ఇటీవల పార్టీలో చేరి ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్న చల్లా రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఉన్నారు. స్థానిక సంస్ధల కోటా నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు. వీరంతా టిడిపికి సంబంధించిన వారే, దీపక్ రెడ్డి, బీటెక్ రవి, కేఈ ప్రభాకర్, బిఎన్ రాజసింహులు, చిక్కాల రామచంద్రరావు, అంగర రామ్మోహన్, మంతెన సత్యనారాయణ రాజు, శత్రుచర్ల, వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. వీరిలో వాకాటి ప్రస్తుతం బిజెపికి జంప్ అయ్యారు. అలాగే గ్రాడ్యుయేట్స్ కోటాలోని ముగ్గురు రిటైర్ కావలసి ఉంది. అలాగే గవర్నర్ కోటా నుంచి ఇద్దరు రిటైర్ కానున్నారు. ఇక 2025 ఏడాది లో రిటైరయ్యే ఎమ్మెల్సీలనూ అత్యంత దురదృష్టవంతులుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు ముగిసిన ఏడాది తరవాత కూడా మండలిలో సభ్యులుగా కొనసాగే అవకాశం వీరికుంది. వీరిలో ఎమ్మెల్యేల కోటా నుంచి రిటైరయ్యే సభ్యుల సంఖ్య ఐదుగురు కాగా వీరిలో టిడిపి నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఒకరు రిటైర్ కాబోతున్నారు. టిడిపి నుంచి యనమల, బీటీ నాయుడు, అశోక్ బాబు, దువ్వారాపు రామారావు ఉంటే వైసీపీ నుంచి జంగా కృష్ణ మూర్తి ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కోటా నుంచి కేఎస్ లక్ష్మణరావు, వెంకటేశ్వరరావులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారు 2025 లో రిటైర్ కావలసి ఉంటుంది. టీచర్ ల కోటా నుంచి పాకాలపాటి రఘువర్మ కూడా పీడీఎఫ్ నుంచి ఉన్నారు. వీరిని అత్యంత దురదృష్టవంతులుగా రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.