విశాఖ భూ కుంభకోణంలో కొత్త సిట్ విచారణ ధర్మానకు అనుకూలంగా జరుగుతుందా?
posted on Feb 3, 2020 10:45AM

విశాఖ భూ కుంభకోణంపై కొత్త సిట్ కొద్ది రోజుల కిందటే తన మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. దాని వివరాలేమిటో తెలియరాలేదు, అయితే పాత సిట్ చెప్పినంత స్పష్టంగా ధర్మాన వ్యవహారంపై కొత్త సిట్ తన రిపోర్టులో ప్రస్తావించిందా, దారి మళ్లిందా అన్న అంశాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం నియమించిన సిట్ విశాఖ భూ కుంభకోణంలో ధర్మానపై తీవ్రమైన అంశాలను ప్రస్తావించింది. పద్నాలుగు ఎన్ వో సీ ల కేసుల్లో ఆయన పాత్రను ఎత్తి చూపింది. విశాఖ, దాని చుట్టుపక్కల కోట్ల విలువ చేసే భూములు మాజీ సైనికుల నుంచి ధర్మాణ కుటుంబీకులు, సన్నిహితుల కంపెనీలూ, వ్యక్తుల పేరిట బదిలీ అయ్యాయని వెల్లడించింది. ఒక్కో భూమి విషయంలో ధర్మాన ఎలా వ్యవహరించారో స్పష్టంగా పేర్కొంది. అయితే కొత్త సిట్ ఇచ్చిన నివేదికలో ఆ తీవ్రత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ధర్మాన రెవిన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే అధికారులు విశాఖ రూరల్ భీమునిపట్నం, పరవాడ, పరదేశిపాలెం, దేశపాత్రునిపాలెం, మధురవాడ, పెదముసిడివాడ, తదితర ప్రాంతాల్లో మాజీ సైనికులు ఎన్ వో సీ లు ఇచ్చారు. ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములను అమ్ముకునేందుకు భారీగా ఎన్ వో సీ లు ఇచ్చారు. ఈ పత్రాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని అలా ప్రభుత్వం చేయిదాటిన భూములు, ఆ తర్వాత నాటి పెద్దల నియంత్రణలోకి వెళ్లాయని పాత సిట్ చెప్పింది. కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్ని మాజీ సైనికుల నుంచి నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబీకులు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న మిత్రుల కంపెనీలూ చేజిక్కించుకున్నాయని తేల్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాన, ఆయన సన్నిహితులపై విచారణ జరిపించాలని కొన్ని కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. రెవిన్యూ అధికారులు భూములపై తీవ్రమైన నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డారని, మాజీ సైనికుల భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ కు గురయ్యాయని పేర్కొంది. వీటిపై ఫోరెన్సిక్ పరిశీలనలు జరిపించాలని సూచించింది, అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్నదే ఎన్ వో సీ అని అందరూ భావించేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది.
కొత్త సిట్ ఛైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ దృష్టికి వచ్చిన అన్ని కేసులను పరిశీలిస్తున్నామని ప్రభుత్వ భూముల దురాక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్, క్లాసిఫికేషన్ మార్పు, ఎన్ వో సీ ల జారీ వంటి అంశాలపై విచారణ చేస్తున్నామని అనేక అక్రమాలు, తప్పులను గుర్తించామని చెప్పారు. వీటికి బాధ్యులైన అధికారులు ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశామన్నారు. పాత సిట్ రిపోర్టులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఉంది కదా మీరు ఆ కేసులను విచారిస్తున్నారా అని ఆయనను ప్రశ్నించగా పాత సిట్ రిపోర్టును టీమ్స్ పరిశీలిస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పామని పూర్తి రిపోర్ట్ ఇంకా సమర్పించాల్సి ఉందని బదులిచ్చారు. వాస్తవానికి కొత్త సిట్ కూడా ఎన్ వో సీ ల కేసులపై విచారణ జరిపింది. ఈ కేసుల్లో ధర్మాన ప్రస్తావన ఉందా లేక ఆయనను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.