పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ అనుచరుల దందా.. ప్రశ్నిస్తే ప్రజలపై దౌర్జన్యం!!
posted on Feb 3, 2020 10:30AM

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి శంకర్ నారాయణ అనుచరులు దందాలకు తెర తీశారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందే అంటూ తమనుంచి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెనుకొండ నియోజక వర్గంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే అదునుగా భావించిన వైసీపీ నాయకుడు శివానందరెడ్డి దందాకు తెరలేపారు. ఇంటి పట్టా మంజూరు చేయిస్తానంటూ శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. అయితే ఇటీవల ఇంటి పట్టాలకు సంబంధించి లబ్ధిదారులుగా ఎంపికైన వారి జాబితాను గ్రామంలో చదివి వినిపించారు. తాము ఒక్కొక్కరం ఇరవై వేల రూపాయలు ఇచ్చినా ఇంటి స్థలం మంజూరు కాకపోవడం ఏంటంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి అనుచరుడు శివానందరెడ్డిని నిలదీశారు.
దీన్ని జీర్ణించుకోలేని శివానందరెడ్డి గ్రామస్థులు తనపై దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని చితక బాదారు. విషయం తెలుసుకున్న బాధితులకు చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇంటి పట్టా కోసం ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే తమపైనే ఎదురు దాడి చేసి పోలీసులతో కొట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి శంకర నారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఇరు వర్గాలతో పంచాయతీ ఏర్పాటు చేశారు. బాధితులు మంత్రికి తమ గోడు చెబుతూ ఉండగా అడ్డుకున్న శివానందరెడ్డి మళ్లీ వారిని బెదిరించడంతో మంత్రి సమక్షంలోనే రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. దాంతో మంత్రి చేసేదేమి లేక అంతా బయటికి వెళ్లి మాట్లాడుకొని రావాలని పంపటంతో ఇరువర్గాలకు చెందిన వారిమధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. తమకు కూలికెళితేగానీ ఇల్లు గడవని పరిస్థితి ఉందని, పైసా పైసా కూడ బెట్టి ఇల్లు కట్టుకుందామంటే మంత్రి అనుచరులు మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ అంతకంతకూ పెద్దదై అందరికీ తెలియడంతో మంత్రి అనుచరులపై అంతా మండిపడుతున్నారు. మీ అనుచరులు మోసం చేశారని మంత్రికి చెప్పుకున్నా న్యాయం జరగకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.