అర్ధరాత్రి సాయం కోసం ఫోన్.. కోటంరెడ్డి ఏం చేశారో తెలుసా?
posted on Jul 29, 2025 10:00AM
.webp)
ప్రజాప్రతినిథి ప్రజా సేవలో 24 X7 పని చేయాలని జనం భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తారు. అయితే చాలా మంది ఎన్నికలకు ముందు ప్రజా సేవ పట్ల చూపిన ఆసక్తిని ఆ తరువాత చూపించరు. ఐదేళ్ల పాటు తమను కదిలించే వారు ఎవరూ ఉండరన్న ధీమాతో వ్యవహరిస్తారు. గత ఐదేళ్ల జగన్ హయాంలో జనం ఇదే తీరును చూశారు. ప్రజలకు అండగా ఉండటం అటుంచి.. వారినే వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్ల వేళలా అండగా ఉంటామని మాటల్లో చెప్పడమే కాదు.. చేతల్లో కూడా చూపిస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రజలకు కష్టం వస్తే అర్ధరాత్రి, అపరాత్రి కూడా చూడకుండా ముందుకు వస్తానని నిరూపించారు. విషయమేంటంటే..
నెల్లూరులో ట్రాఫిక్ పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఆ క్రమంలో వేదాయపాలెం సర్కిల్ లో ట్రాఫిక్ పోలీసులు బైకుపై వెడుతున్న భార్యాభర్తలను ఆపి తనిఖీ చేశారు. ఆ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ రూ. పది వేలు జరిమానా కట్టమన్నారు. బైకు స్వాధీనం చేసుకుని భార్యాభర్తలను అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో ఏం చేయాలో తొచని ఆ జంట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్ కాల్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని.. తక్షణమే బైక్‌ను బాధితులకు హ్యాండోవర్ చేయాలనీ ఆదేశించారు. దీంతో పోలీసులు క్షణాల్లో బైక్‌ను ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకొచ్చి దంపతులకు అప్పజెప్పారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా తమకు అండగా నిలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ దంపతులు కృతజ్ణతలు తెలిపారు.