సామాజిక ఓట్లపై సుబ్బిరామిరెడ్డి కన్ను!
posted on May 24, 2012 11:01AM
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సామాజిక ఓట్లను సాధించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. సహజంగా తనకున్న సినీ అనుభవాలు, రాజకీయానుభావాలు దృష్టిలో ఉంచుకుని ఆయన పావులు కదుపుతున్నారు. టిక్కెట్టు అధికారికంగా ప్రకటించక ముందే ఈ నియోజకవర్గంలో కాలుమోపకుండానే కులాల వారీగా ఓటర్ల వివరాలను సుబ్బిరామిరెడ్డి తెప్పించుకున్నారు. ముందుగా జనాభాలో విద్యావంతులను గెలుచుకుని తరువాత మాస్ క్యాంపెయిన్ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్న సుబ్బిరామిరెడ్డి దాని ప్రకారం కులసంఘాలను,. సామాజికసేవలో ఉండే యువజన సంఘాలను, సంక్షేమ సంఘాలను ఒకేసారి పిలిపించి విడివిడిగా వారి సహాయం అర్థించారు. దీంతో ఆగకుండా తన ప్రచారంలో ఏ సంఘ కార్యాలయం ఉన్నా దానిలో ఉన్న కార్యవర్గాన్ని కలిసి ఉత్సాహపరుస్తున్నారు.
ఈ లోక్ సభ స్థానంలో సుమారు 14లక్షల 50వేల 939 (2009 పోలింగ్ ప్రకారం) ఓటర్లున్నారు. తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డికి గత ఎన్నికల్లో 4,30,235 ఓట్లు వచ్చాయి. ఈయన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల రెడ్డికి 3,75,242 ఓట్లు వచ్చాయి. ఇలాంటి గణాంకాలతో సహా అన్ని వివరాలు సంపాదించిన సుబ్బిరామిరెడ్డి ఇటీవల ముస్లీం వేషధారణలో నియోజకవర్గంలోని ముస్లీం సోదరుల కోసం చేస్తున్న కార్యక్రమాలను ఆయన ఫక్తు ఉర్దూలో వివరించి వారి మనస్సు గెలుచుకున్నారు. ముస్లీం సోదరులు చివరగా సుబ్బిరామిరెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇలా సామాజిక ఓట్లతో గెలుపుబాట వేసుకునేందుకు సుబ్బిరామిరెడ్డి కృషి చేస్తున్నారు.