నెహ్రూ హయాంలోనే సుపరిపాలన.. కేసీఆర్

కొన్నిసార్లు ఊహించ‌ని మార్పును రాజ‌కీయాల్లోనూ గ‌మ‌నిస్తుంటాం. కానీ తెలంగాణా ఆవిర్భావం త‌ర్వాత‌ కాంగ్రెస్ గురించి ఒక్క మాటా మంచిగా చెప్ప‌ని టీఆర్ ఎస్ అధినేత గ‌తంలో కాంగ్రెస్‌పాల‌నే ఇప్ప‌టి మోదీ పాల‌న‌కంటే చాలా న‌యం అని ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. మోడీ కంటే నెహ్రూయే కేంద్ర రాష్ట్ర సంబంధాల విష‌యంలో ఎంతో ఆలోచించార‌న్న‌ది చ‌రిత్ర‌చెబుతోంద‌ని అన్నారు. కేసీఆర్ నీతి ఆయోగ్ స‌మావేశాల‌కు వెళ్ల‌డం ప‌ట్ల ఆస‌క్తి లేద‌ని ఆయ‌న ప్ర‌ధాని మోడీకి రాసిన లేఖ ద్వారా స్ప‌ష్టంచేశారు.  

సోమ‌వారం  జ‌రిగే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే గవర్నింగ్ కమిటీ సమావేశానికి  తెలంగాణా సీఎం కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. ఆ సమావేశం వ్యర్ధమని కేసీఆర్ అన్నారు. శనివారం ( ఆగస్టు 6) ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన నీతి ఆయోగ్ ల‌క్ష్యాలు ఇటీవ‌లి కాలంలో దారిత‌ప్పాయ‌ని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు చెప్పారు. మిషన్‌ కాకతీయ కు ఐదు వేల కోట్ల గ్రాంట్‌, మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని తెలిపారు. చెబితే విని అమలు చేసే సంస్కారం  నాటి ప్రధానులకు ఉండే దని,మోడీ సర్కార్ కు అటువంటి సంస్కారం లేదని కేసీఆర్ విమర్శించారు.

నెహ్రూ హయాంలో సామ్యవాద సౌభ్రాతృత్వం ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ప‌నిచేసింద‌ని, అటువంటి అద్భుత‌ కేంద్ర రాష్ట్ర సత్సంబంధాల రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఇప్పుడు లేద‌ని వ్యాఖ్యానించారు. ఊహిం చ‌ని విధంగా టీఆర్ ఎస్ అధినేత నోట నెహ్రూ ప‌ట్ల, కాంగ్రెస్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.  ప్రస్తుత కేంద్ర పాల‌న‌లో కేవ‌లం రాజ‌కీయాల‌కే ప్రాధాన్య‌త‌నివ్వ‌డంతో కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు దెబ్బ‌తిన్నాయ‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్ప‌టి రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో నీతి అయోగ్ వ‌ల్ల ప్ర‌యోజ‌నంలేద‌న్నది విస్పష్టంగా తేల్చేశారు.

కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాల‌తో స‌హకార సామ్రాజ్య‌వాద స్పూర్తిని అక్ష‌రాలా అమ‌లు చేయాల న్న ల‌క్ష్యంతోనే నీతి ఆయోగ్ ఏర్పాటయింది.  కానీ మోడీ ఆ లక్ష్యాలను నీరుగార్చేశారని విమర్శించారు. కాల‌క్ర‌మంలో ఈ ఆధునిక రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో ఆ స్పూర్తి దెబ్బ‌తిని కేవ‌లం రాజ‌కీయ ఆధిప‌త్య ధోర‌ణిలో కేంద్ర‌ం వ్యవహరించడంతో సమాఖ్య స్ఫూర్తి ఆవిరైందన్నారు.  ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చిందని, కొత్త నిబంధనలతో తెలంగాణ రాష్ట్ర ప్రగతికి అవరోధం ఏర్పడిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి సాధ్యమవుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నా రు. నిరుద్యోగం పెరిగిపోయిందని, ద్రవ్యోల్బణం అదుపుతప్పిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో ధ‌ర‌ల‌పెరుగుద‌ల‌, అవినీతి, నిరుద్యోగం, రాష్ట్రాలమ‌ధ్య స‌త్సంబంధాల‌కు సంబంధించిన అనేక అంశాల‌ను కేంద్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు. నీతి అయోగ్ స‌మావేశాల్లో వీటిపై అస‌లు చ‌ర్చ‌కే ఆస్కారం లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలో మ‌త క‌ల‌హాలు, హ‌త్యారాజ కీయాలు, బుల్‌డోజ‌ర్ల హెచ్చ‌రిక‌లు వంటివి ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ తెస్తున్నాయ‌న్నారు. దేశంలో ప్ర‌జల‌కు అభ‌ద్ర‌త పెరిగిపోయిం ద‌న్నారు.