కొంచెం తీపి..కొంచెం చేదు

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున ఒక ఛాయ్ వాలా భారతదేశ భవితను నిర్దేశించేందుగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. ఆయనే నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ. అప్పటికే పీకల్లోతు అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో దేశ ప్రతిష్టను మంట గలిపిన కాంగ్రెస్‌పైన కోపంతో సంకీర్ణ ప్రభుత్వాలు తప్న దేశానికి సుస్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని అందరూ నమ్ముతున్న దశలో మోడీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు ప్రజలు. మరి ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్న మోడీ, ఆ ప్రజల నమ్మకాన్ని నిలుపుకున్నారా? ఈ రెండేళ్లలో ఆయన సాధించిన విజయాలేమిటీ.? వైఫల్యాలేమిటీ.? అనే చర్చ మరోసారి దేశం మొత్తం జరుగుతోంది.

 

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా  సాధించిన పాపులారిటీతోనే మోడీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని స్పష్టంగా చెప్పవచ్చు. 2014లో ప్రధాని అయిన తొలి రోజుల్లో ఆయన సీఎంగానే ఆలోచించేవారు. కానీ ఈ రెండేళ్ల సమయంలో మోడీ ఎంతో నేర్చుకున్నారు. కేంద్రంలోని వ్యవస్థల పనితీరును త్వరగానే అర్థం చేసుకున్నారు. అప్పట్లో సీనియర్ మంత్రులపై ఆధారపడిన మోడీ ఇప్పుడు తానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టారు. యూపీఏ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా చాలా వరకూ అంతంత మాత్రంగానే అమలయ్యాయి. దీనిపై దృష్టిసారించిన మోడీ నగదు బదిలీ, ఆధార్ అనుసంధానం ద్వారా పేదల ముంగిట్లోకి సంక్షేమ ఫలాలను అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.10 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరవటం ద్వారా..ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినితీ అవకాశాలను తగ్గించడం, ఆ ప్రయోజనాలు మరింత ఎక్కువ మంది ప్రజలకు అందేలా చేశారు.

 

ఇక ధరల విషయానికి వస్తే అధికధరలు అనేది నిరంతర సమస్య. ఈ రెండేళ్లలో ప్రజల కనీస ఆహార పదార్ధాల ధరలు భారీగా పెరిగాయి. కందిపప్పు కిలో రూ.200 చేరుకుని సామన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది.  అలాగే అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు తగ్గినా మన దగ్గర మాత్రం భారీగా ఉండటాన్ని ప్రజలు సమర్ధించడం లేదు. కానీ వీటి విషయంలో మోడీ సర్కార్ అనుకున్నంత కృషి చేయలేదు. ఇక పారిశ్రామిక రంగాన్ని మోడీ వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. దేశీ తయారీ రంగానికి చేయూతనిచ్చేలా "మేకిన్ ఇండియా" కార్యక్రమాన్ని తలపెట్టారు. దీని కింద దాదాపు 400 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే చిన్న సంస్థల ఏర్పాటుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం "స్టార్టప్ ఇండియా"ను ప్రారంభించారు. మోడీ సంస్కరణల ఫలితంగా రైల్వే, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా వచ్చాయి. కార్పోరేట్ కంపెనీల మార్జిన్లు పుంజుకున్నాయి. కరెంట్ అకౌంట్, ద్రవ్య పరిస్థితులు మెరుగయ్యాయి. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా చైనాను భారత్ అధిగమించింది.

 

ఇక మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాల్లో కెల్లా అతిపెద్దది విదేశాంగ విజయం. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచడానికి..తద్వారా దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడానికి మోడీ గతంలో ఏ ప్రధాని చేయని విధంగా అనేక దేశాల్లో పర్యటించారు. దశాబ్ద కాలంపైగా ఊరిస్తూ వచ్చిన భారత్-ఇరాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు . వీటన్నింటి ద్వారా భారత విదేశీ విధానానికి మోడీ కొత్త జీవం పోశారని చెప్పవచ్చు. యూపీఏ ప్రభుత్వానికి అపకీర్తిని మూటకట్టిన అవినీతి విషయంలో నరేంద్రుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఎవరిపైనా అవినీతి ఆరోపణలు రాకుండా మోడీ జాగ్రత్తలు తీసుకున్నారు. అటు రాజకీయంగానూ మోడీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తన రాజకీయ పత్యర్థి కాంగ్రెస్‌ను కట్టడి చేసి "కాంగ్రెస్ ముక్త భారత్ "దిశగా దూసుకుపోతున్నారు. 2014 లో మోడీ అధికారం వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది..కానీ రెండేళ్ల తర్వాత తిరిగి చూస్తే కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు ఏడుకు తగ్గిపోయాయి. వీటిలో కర్ణాటకను మినహాయిస్తే అన్నీ చిన్నచితకా రాష్ట్రాలే. ఇదే సమయంలో ఎన్‌డీఏ సర్కార్ కొలువుదీరే నాటికి 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సొంతంగా లేదా సంకీర్ణంగా ప్రభుత్వాలను నడుపుతోంది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోంలో గెలుపుతో ఈశాన్యంలో మొదటి సారి పాగా వేసింది.

 

 

ఇన్ని విజయాలు సాధిస్తున్నా మోడీకి విమర్శలు తప్పడం లేదు. ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్నట్టు నల్లధనం వెనుక్కు తీసుకురాలేదు. ఆయన రెండేళ్లపాలనలో ఏదైనా పెద్ద విమర్శ ఉందంటే అది సమాజంలో పెరుగుతున్న అసహనమే. తమ మాట వినని కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యార్థుల పట్ల అసహనం. హెచ్‌సీయూ, జేఎన్‌యూలలో చేలరేగిన అల్లర్లు తదితరా అంశాల విషయంలో మోడీ సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో మోడీ హయాంలో జరిగినన్ని కాల్పులు ఏ ప్రధాని హయాంలోనూ జరగలేదు. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత పోస్ట్‌లపై దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు..ఇంకా కోల్పోతూనే ఉన్నారు. అటు  చైనా రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా చొచ్చుకుని వస్తున్నా మోడీ సర్కార్ ధీటైన జవాబివ్వడంలో విఫలమైందని చెప్పవచ్చు. మొత్తం మీద మోడీ రెండేళ్ల పాలన అన్నివర్గాలను అనుకున్నంత మేర సంతృప్తి పరచలేకపోయినా ఆయన తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో సమర్థుడైన ప్రధాని లేడంటున్నారు. మిగిలిన మూడేళ్లలో అయినా సామాన్యుడి కలల్ని మోడీ నిజం చేసి "అచ్చేదిన్" తీసుకువస్తారని ఆశిద్దాం..