'వందే'మాతరం అంటోన్న సామాన్య జనం!

మోదీ నిర్ణయంతో బ్లాక్ మనీ వున్నోళ్ల మైండ్స్ బ్లాంక్ అయ్యాయి! 500, 1000 నోట్ల రద్దుతో వాళ్లందరికీ లక్ష టెన్షన్లు ఒకేసారి వచ్చిపడ్డాయి. కాని, సామాన్యుల కష్టాలు మరోలా వున్నాయి. చెల్లని 5వందలు, వెయ్యి సరే... దొరకని వంద నోటు సంగతేంటి? అన్నదే కామన్ మ్యాన్ తల నొప్పి అయిపోయింది!


ఎప్పుడూ మన్ కీ బాత్ అంటూ జనంతో మాట్లాడే మోదీ ఈసారి మనీ కీ బాత్ చేసేశాడు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నానంటూ దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. కాని, అయిదు వందలు, వెయ్యి లేకుంటే కావాల్సిన వంద మాత్రం మార్కెట్లో అంత తేలిగ్గా దొరకటం లేదు. వున్న ఏకైక దిక్కు పెట్రోల్ బంక్ లే. కాని, అక్కడా నో స్టాక్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి! అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచీ పంపులు ఏకధాటిగా పెట్రోల్ చిమ్ముతుండటంతో బంక్ లు కూడా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చేసింది! అంతే కాదు, కామన్ మ్యాన్ ఖర్చుల కోసం వంద నోట్ల ఆశతో ఫ్యుయల్ స్టేషన్ కి వెళితే అక్కడా మంద తప్ప వంద దొరకటం లేదు. పెట్రోల్ పోస్తోన్న బంకుల్లో కూడా మొత్తం అయిదు వందల రూపాయల ఇంధనం ఖరీదు చేయాల్సి వస్తోంది. అంతే తప్ప చిల్లర ఇచ్చేది మాత్రం లేదంటున్నారు!


మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఎఫెక్ట్ ఎలా వుంటుందో మామూలు జనాలకి ఉదయం నుంచే అవగాహనకి వచ్చేసింది! పాల ప్యాకెట్ కోసం వంద కాకుండా 5వందలు ఇస్తే అమాంతం రిజెక్ట్ అయిపోతున్నాయి. అదే పరిస్థితి టిఫిన్ సెంటర్లు, హోటల్స్ వద్ద కూడా ఎదురయ్యే సరికి సామాన్యుడు పొద్దు పొద్దున్నే చుక్కలు చూడాల్సి వస్తోంది! పాలు, టిఫిన్, కూరగాయలు, బస్ పాసు, ఎంఎంటీఎస్ టిక్కెట్లు... ఇలా అన్నీ చిల్లర వుంటేనే వర్కవుట్ అయ్యే పనులు. కాని, ఇప్పుడు లేనిదే ఆ చిల్లర!


వందలు కరువైన సామాన్య జనం ఏటీఎంలు, బ్యాంక్ లకు వెళదామన్నా అవ్వీ క్లోజ్ అనేశారు. సో... ఇప్పుడు రెండ్రోజుల దాకా వున్న కాసింత చిల్లర, పది, వంద నోట్లనే జాగ్రత్తగా వాడుకోవాలి. తరువాత మందలు మందలుగా వెళ్లి ఏటీఎంలపై పడి వందలు తీసుకోవాలి. అంతదాకా ఈ టెన్షన్ తప్పదు! కాని, నల్లధనం , పాక్ సరఫరా చేసిన దొంగ నోట్ల మీద యుద్ధంలో మనమూ ఇలా ఎంతో కొంత ఇబ్బంది పడుతూ భాగస్వాములం అవ్వటం తప్పనిసరి! లేదంటే మొత్తం దేశానికే చేటు జరిగే పరిస్థితులు వచ్చాయి మరి! 


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu