నానీ .. ఎందుకొచ్చిన ఆవేశం?!

చింత చ‌చ్చినా పులుపు చావ‌ద‌ని ఓ సామెత‌. రాష్ట్రంలో త‌లెత్తుకోలేని ప‌రిస్థితి తెచ్చుకుని విప‌క్షాల మీద కారాలు మిరియాలు నూర‌డం, స‌వాలు విస‌ర‌డం వైసీపీ నాయ‌కుల ప్ర‌త్యేక‌త‌. మూడేళ్ల పాల‌న‌లో  ప్ర‌జ ల‌కు అద్భుత పాల‌నేమీ ఇవ్వ‌లేదు.  భారీ ప్ర‌చారాలు, అమ‌లు చేయ‌లేని  హామీల‌తో వూద‌ర‌గొట్ట‌డం త‌ప్ప చేసిందేమీ లేద‌న్న‌ది ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మ‌యిపోయింది. కానీ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం టిడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పై విరుచుకు ప‌డ‌టం స‌వాలు చేయ‌డం వారిలో ఆత్మ‌విశ్వాసం కోల్పోయిన ల‌క్ష‌ణాల‌నే ఎత్తిచూపుతున్నాయి. 

మొన్న‌టికి మొన్న ఆత్మ‌కూరులో భారీ మెజారిటీతో గెల‌వాల‌న్న ఆదేశాలు, నాయ‌కుల మోహ‌రిం పులు, ప్ర‌చారార్భాటాలూ అన్నీ వెర‌సి ల‌క్ష‌కంటే బాగా త‌క్కువ మెజారిటీకే పరిమితమవ్వాల్సి వచ్చింది.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజక వర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నన్ను ఓడించడం కాదు.. 2024లో కుప్పంలో గెలవాలి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతన్ని నమ్ముకు న్న దత్తపుత్రుడిని ఓడిస్తాం. 2024, 29 ఎన్నికల్లో కూడా నేనే గెలుస్తా, గుడివాడలోనే చస్తాను. జగన్‌కు అడ్డంగా నిలబడ్డ తమను దాటుకొని చంద్రబాబు, దత్తపుత్రుడు ముందుకు వెళ్లాలన్నారు.

 గుడివాడ‌లో, మ‌చిలీప‌ట్నంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మ‌ధ్య విభేదాలు  స‌ద్దుమ‌ణ‌గ‌నే లేదు. వారిని శాంత ప‌ర‌చ‌డానికి  జ‌గ‌న్ విశ్వ‌య‌త్నం చేశారు. ప‌థ‌కాల అమ‌లు, రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితుల గురించి ఇప్ప టికే ప‌రువు కోల్పోయిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇంకా వ‌చ్చే ఎన్నిక‌ల మీద ఆశ‌లు పెట్టుకోవ‌డం చిత్రం. ఆర్ధిక ప‌రి స్థితులు,  రాష్ట్రం ప్ర‌భుత్వం అప్పుల వ్య‌వ‌హారాల్లో నిజానిజాలు కేంద్రం తేట‌తెల్లం చేసిన‌ప్ప‌టికీ  కాగ్ నివేదిక మెచ్చుకోలు వెనుక మ‌త‌ల‌బులు వైసీపీ వారికే  ఎరుక‌. రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌న‌సులో వైసీపీ ప‌ట్ల అభి మానం రోజు రోజుకీ త‌గ్గిపోతోంది. 

ఇక లాభం లేద‌ని గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. దీని ద్వారా ప్ర‌జ‌ల‌ను స్వ‌యంగా ఇంటి వ‌ద్దే క‌లిసి క‌ష్ట‌న‌ష్టాల ముచ్చ‌ట్లు చెప్పాల‌నుకున్నారు. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా ప్ర‌బుత్వ ప‌థ‌కాలు, జ‌గ‌న్ పాల‌న ఎంత‌వ‌ర‌కూ ఆంధ్రప్ర‌దేశ్‌కు అవ‌స‌రం అన్న‌ది మెల్ల‌గా వారి చెవుల్లోకి ఎక్కించాల‌నుకున్నారు.  కానీ ఎటు వెళ్లినా, ఎక్క‌డికి వెళ్లానా ప్ర‌శ్న‌ల దాడే ఎదుర‌యింది. రోడ్లు, పింఛ‌న్లు, ప‌థ‌కాల బెనిఫిట్ల విష యాల్లో త‌మ‌కు జరుగుతున్న అన్యాయాన్ని నిల‌దీయ‌డంతో వైసీపీ నాయ‌కులు  మ‌రోమాట లేక వచ్చిన దారినే వెనుదిరగాల్సి వస్తోంది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు అలా నీరుగార‌డంతో మ‌రో మార్గం క‌నుగొన్నారు.. అదే సామాజిక న్యాయ  భేరి  పేరుతో బ‌స్సు యాత్ర!  వైసీపీవారు గ‌ట్టిగా పైకి అన‌క‌పోయినా నిజానికి ఇది వారి చివ‌రి అస్త్రమ‌నే అనాలి. ప్ర‌జ ల‌కు త‌మ ప‌ట్ల విముఖ‌త‌ను తొల‌గించ‌డానికి, వారిని త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికి చేప‌ట్టిన అనేక  జిమ్మి క్కుల్లో ఇదొక‌టి.  ఏపీ అధికార వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర మే 26 నుంచి 29 వ‌ర‌కూ చేప ట్టింది.  

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రానికి జ‌ర‌గ‌వ‌ల‌సిన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని, కేంద్రానికి  ఎన్నిప‌ర్యా యాలు నివేదిక‌లు ఇచ్చినా మొండివైఖ‌రితో వాటిని బుట్ట‌దాఖ‌లు చేసింద‌నే ప్ర‌చారం చేస్తూ, త‌మ త‌ప్పే మీ లేద‌ని తాము చాలా స్వ‌చ్ఛ‌మ‌ని ప్ర‌జ‌ల ముందు నిల‌వ‌డానికి తీవ్ర య‌త్నాలు జ‌రిగాయి. కానీ ఇది కూడా వూహించ‌నివిధంగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను తొల‌గించ‌డానికి చేప‌ట్టిన‌, చేప డుతున్న స‌క‌ల చ‌ర్య‌లూ వైసీపీ ప్ర‌భుత్వాన్ని అవ‌మానాల‌కు గురిచేస్తున్నాయి.  ఈ విధ‌మైన వ్య‌తిరేక త  ప్ర‌జ‌ల నుంచి వూహించ‌క‌పోవ‌డంతో వైపీపీ నాయ‌కులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా జనం వారి  వివ‌ర ణ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు.  
 
ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై కొడాలి నాని విసుర్లు, విమర్శలు, స‌వాలు చేయ‌డం ఆ పార్టీ ఆర్భాట గాంభీర్య‌మే క‌న‌ప‌డుతోంది. త‌మ‌ను ప్ర‌జ‌లు నిర‌సిస్తున్నార‌న్న బాధ‌తోనే నానివంటి వారు విప‌క్షాల మీద  స‌వాలు చేస్తూ, హెచ్చ‌రిక‌లు చేస్తూ లేని బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.