వందేళ్ల చేప‌.. ప‌ట్టారు, వ‌దిలేశారు

స‌ముద్రం మీద‌కి వెళ్లి రోజంతా వ‌ల విసిరి సాయంత్రానికి ఓ ప‌ది చేప‌లు కాస్తంత పెద్ద‌వి ప‌ట్టుకు  వ‌స్తే మ‌త్స్య‌కారుల కుటుంబానికి, ఒడ్డున వేచి వున్న‌వారంద‌రికీ తెగ సంబ‌రం. ఎప్పుడో గాని బాగా పెద్ద చేప‌లు ప‌డ‌వు. కానీ వ‌ల‌తో వేట‌కు వెళ్ల‌కా త‌ప్ప‌దు. కానీ  వేట‌కి వెళ్లిన‌వారికి హ‌ఠాత్తుగా అతి పెద్ద, పురాత‌న  చేప దొరికితే?  దాన్ని ప‌ట్టి అతిక‌ష్టంమీద బ‌య‌టికి  తీసికొచ్చి చూసి ఆనందిస్తారా, కోసి వారం రోజులు తినేద్దా మ‌నుకుంటారా?  సాధార‌ణంగా రెండో ఆప్ష‌న్ కే ఇష్ట‌ప‌డతారు జ‌నాలు. కానీ స్టీవ్‌, మార్క్ అనే మ‌త్స్య‌కారు లు మాత్రం అలా అనుకోలేదు. వాళ్లు మొద‌టి ఆప్ష‌న్ నే ఎంచుకున్నారు. 

విష‌య‌మేమంటే.. బ్రిటీష్ కొలంబియాకి చెందిన స్టీవ్‌, మార్క్‌లు న‌దీజ‌లాల్లో వేటాడ‌టంలో  వ‌ల‌ను వొడు పుగా విసిరేసి ప‌ట్ట‌గ‌ల మ‌రో ఇద్ద‌రు నిపుణుల‌తో క‌లిసి లిల్లూటీ అనే న‌దిలోకి ప్ర‌యాణ‌మ‌య్యారు. రెండు గంట‌ల త‌ర్వాత హ‌ఠాత్తుగా వారికి  తెల్ల‌టి స్ట‌ర్జియ‌న్  ప‌ట్టుబ‌డింది. దాని సైజు చూసి  నిర్ఘాంత‌పోయారు. అది ఏకంగా ప‌ధ్నాలుగు అడుగులు వుంది.  మ‌రీ చిత్ర‌మేమంటే దాని వ‌య‌సు సుమారు వందేళ్లు! దాని బ‌రువు ఏకంగా 317 కేజీలు. దాని న‌డుము చుట్టుకొల‌త 57 అంగుళాలు. ఇది నిజంగానే అతి ప్రాచీన కాలం చేప అంటున్నారు జ‌ల జీవాల నిపుణులు.  ఉత్త‌ర అమెరికాలోని న‌దీజ‌లాల్లో ఇటువంటివి అప్పుడ‌పుడు క‌న‌ప‌డ‌తాయిట‌. ఇవి 14 అడుగుల పొడ‌వు, 680 కిలోల బ‌రువు వ‌రకూ పెరుగుతాయిట‌. 

కాగా ఈ తెల్ల స‌ర్జియ‌న్ చేప శరీరంపై ఎముక‌ల పలకలతో చాలా పెద్ద ఆదిమ చేప. ఇది సమశీతోష్ణ సము ద్రాలు  ఉత్తర అర్ధగోళంలోని నదులలో, ముఖ్యంగా మధ్య యురేషియాలో క‌న‌ప‌డుతుంది.  దాని మాంసా నికి వాణిజ్య ప్రాముఖ్యత ఉంది. ఇటువంటి చేప‌లు క‌నీసం 150 ఏళ్లు జీవిస్తాయ‌ని జ‌ల జీవాల ప‌రిర‌క్ష‌ణ సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ సర్జియ‌న్‌ను ప‌ట్టుకున్న వారు దాని చ‌రిత్ర‌ను తెలుసుకుని,  అధికారుల‌కు తెలియ‌జేసి మ‌ళ్లీ  విశాల జ‌ల‌ప్ర‌వాహంలో జాగ్ర‌త్త‌గా వ‌దిలేశారు.