నంద్యాల్లో కాంగ్రెస్‌ "ఓటు" వెనుక రహస్యం..?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న నంద్యాల ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొద్ది నిమిషాల్లో తేలిపోనుంది. ఈ నెల 23న ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తంగా చేయగా..ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గుచూపాడో తెలుసుకునేందుకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ముందంజలో నిలవగా..వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అసలు టీడీపీ ఛాయల వద్దకు కూడా రావడం లేదు. 15వ రౌండ్ ముగిసేనాటికి తెలుగుదేశానికి 81613, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 55881 ఓట్లు పడటంతో దాదాపుగా భూమా గెలిచినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అంత వరకు బాగానే ఉంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అబ్ధుల్ ఖాదిర్‌కు 898 ఓట్లు పోలవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఘోరమైన రాజకీయ తప్పిదం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి 2014 సార్వత్రిక ఎన్నికల సీమాంధ్ర ప్రజలు సమాధి కట్టారు. కనీసం ఒక్క లోక్‌సభ కానీ, ఒక్క అసెంబ్లీ స్థానం కానీ హస్తానికి దక్కకుండా చేశారు. ఓటమి ఎరుగని కాంగ్రెస్ దిగ్గజాలు సైతం మట్టికరిచారంటే ప్రజాగ్రహాం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ అభీష్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందనే అక్కసుతో ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన జనం వైసీపీ, టీడీపీల వైపుకు వెళ్లిపోయారు.

 

పునర్వైభవం కోసం హస్తం నేతలు ప్రయత్నిస్తున్నా...వారిని పట్టించుకునేవారే కరువయ్యారు. ఏ ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పోటీ చేస్తుంది..గెలుస్తామన్న ధీమాతో కాదు..అలా అయినా జనాలకి గుర్తుంటామని. అలా నంద్యాల ఉప ఎన్నికలోనూ హస్తం తన అభ్యర్థిగా అబ్ధుల్ ఖాదిర్‌ను నిలిపింది. ఎలాగూ గెలవం కాదా అని కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ ప్రచారానికి అంతగా ఆసక్తి చూపలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తాము బరిలో ఉన్నాం కాస్త పట్టించుకోండి అంటూ ప్రజలకు గుర్తు చేశారు. తొలి నుంచి నంద్యాల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..మొత్తం 13 సార్లు హస్తం నేతలు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. ముస్లింలు, బలిజ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలన్నీ కాంగ్రెస్‌కు తోడుగా నిలిచాయి. ఎప్పుడయితే కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చిందో అప్పటి నుంచి నంద్యాల ప్రజలు కూడా ఆ పార్టీ పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు.

 

సరే గతం గత: ప్రస్తుతానికి వద్దాం..898 ఓట్లు ఎలా పడ్డాయో చూస్తే..ఉన్న ఓటర్లంతా రెండు ప్రధాన పార్టీల వైపుకు వెళ్లిపోయారు..ఇక చూస్తే తమకు ఉహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్‌నే శ్వాసిస్తూ వచ్చిన వయోవృద్ధులు తమ మనసు చంపుకోలేక హస్తం గుర్తుకే ఓటు వేసి ఉండాలి. అంతే తప్ప అక్కడ ఏ అద్భుతం జరగలేదు..ఇక్కడ ఒక్కచోటే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్‌కు పోలయ్యే ఒకటి రెండు ఓట్లు కూడా వృద్ధులు వేసినవే అని గుర్తిస్తే మంచిది.