పుష్కర సంఘటనపై బాలయ్య ఆవేదన
posted on Jul 14, 2015 6:51PM
.jpg)
రాజమండ్రి పుష్కరాలలో ఈరోజు ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో 27మంది భక్తులు చనిపోవడం తనకు చాలా బాధ కలిగిస్తోందని ప్రముఖ సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మేల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గత నెలరోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరల కోసం అనేక ఏర్పాట్లు చేసిందని, చాలా జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తన అభిమానులు అందరూ పుష్కరాలకి వచ్చే ప్రజలకు వీలయిన విధంగా సేవలందించాలని ఆయన కోరారు. ప్రజలు, ప్రభుత్వం అందరూ ఒకరికొకరు సహకరించుకొంటూ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. తరువాత ఈ ప్రమాదం జరిగిన కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.