బాలయ్యబాబు ఎన్నికలో పోటీకి సిద్ధమేనా ?

 

ఈ రోజు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ అదేశిస్తే రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.

 

బాలకృష్ణ గత కొంత కాలంగా పార్టీ రాజకీయ వ్యవహారాల పట్ల కొంత ఆసక్తి కనబరుస్తున్నపటికీ, ఇంతవరకు ఆయన పూర్తి స్థాయి పాత్ర నిర్వహించేందుకు మాత్రం చొరవ చూపలేదు. ఆయన కుటుంబానికి ఎంత రాజకీయ నేపద్యం ఉన్నపటికీ, ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి కనబరుస్తునందున, వ్యక్తిగతంగా ఆయన పార్టీ మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవలసి ఉంది. సాధారణ ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది గనుక, ఆయనకీ నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి గనుక ఉంటే, మరిక జాప్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగి ఈ ఏడాది కాలాన్ని తన ‘రాజకీయ ఎప్రoటిస్’ కాలంగా భావించి తగిన అవగాహన పెంచుకొంటే మంచిది. అది ఆయనకే కాకుండా ఆయన పార్టీకి కూడా మేలు చేయవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ప్రకటనలు చేయడం అసందర్భ ప్రకటనలుగా పరిగణింపబడుతాయి.

 

కేవలం నందమూరి వంశస్తుడవడమే పార్టీ నుండి టికెట్ ఆశించేందుకు, ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రధాన అర్హతలని భావించకుండా, అందుకు తగిన వ్యక్తినని నిరూపించుకొని పోటీ చేయడమే ఆయనకీ హుందాగా ఉంటుంది.

 

ఈ విషయంలోరాహుల్ గాంధీను ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఆయనకు ప్రధాని పీఠం అధిరోహించడానికి ఏ అడ్డంకులు లేనప్పటికీ, గత 9 సం.లుగా ప్రజల మద్య తిరుగుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొంటూ, తన అవగాహన పెంచుకొంటూ పార్టీని ప్రజలోకి తీసుకు వెళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. తద్వారా, ఆయన ఇప్పుడు ప్రధాని పదవిని ఆశించకపోయినా, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉత్తరాది ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన ఆ పదవికి అర్హుడేనని ఇప్పుడు భావిస్తున్నారు.

 

అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయాలనీ భావిస్తున్న బాలకృష్ణ తదితరులు కూడా కనీసం ఈ ఏడాది కాలంలో ప్రజలలో తిరుగుతూ వారితో సంబందాలు మెరుగు పరుచుకోవడం అన్ని విధాల వారికే మేలు కలిగిస్తుంది. లేదంటే, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న వచ్చే ఎన్నికలలో గెలవడం అంత తేలికయిన పని కాదని ఆఖరి నిమిషంలో అర్ధమయినా అప్పుడు ఇక చేయగలిగేది ఏమి ఉండదు.

 

మారిన సామాజిక పరిస్థితుల్లో సినిమా గ్లామరు రాజకీయాలలో పెద్దగా ఉపయోగపడదని గత ఎన్నికలలో చిరంజీవికి అనుభవపూర్వకంగా అర్ధమయింది. బాలకృష్ణ తానూ కూడా ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోనవసరంలేదు గనుక, ఆయన రాజకీయాలలో ప్రవేశించే ఆలోచన ఉంటే ఇప్పటి నుండే అందుకు సంసిద్ధం అవడం మంచిది.