నాగావళి నీటి పంపకాల్లో రైతులకు అన్యాయం?
posted on Jun 18, 2012 10:11AM
రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నాగావళి నదిపై ఆధారపడ్డ రైతులకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా వీరికి రావలసిన వాటాలో కూడా కొంత స్తీలుప్లాంటుకు కేటాయించటం ప్రభుత్వ దగాకోరుతనాన్ని చాటుతోంది. అసలు రైతు కోసం తామేన్నో పథకాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1978 లెక్కల ప్రకారం నాగావళి నదిలో 44టిఎంసిల నీరు విడుదలవుతుంది. దీనిలో 28టిఎంసిలు ఒడిశారాష్ట్ర వాటా కింద వదిలేయాలి. మిగిలిన 16టిఎంసిలే ఆంధ్రావాటా. అయితే దీనిలో జంఝావతి నదికి 8టిఎంసిలు వదలాలి. మిగిలినది 8టిఎంసిలు మాత్రమే రైతులు సాగుకు ఉపయోగించుకోవాలి. తోటపల్లికి ఈ నీరు వదిలితే బ్యారేజీ సామర్థ్యం 2.5టిఎంసిలు. ఇందులో 2టిఎంసిలు ప్లాంటుకు ప్రభుత్వం కేటాయించింది. చివరకి రైతుకు మిగిలిందేమిటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో సాగునీరు చాలక నాగావళిపై ఆధారపడ్డ రైతులు ఉద్యమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం చేసిన ఈ కేటాయింపులపై కేంద్రమంత్రి కిశోర్ చెంద్రదేవ్ గుర్రుగా ఉన్నారని సమాచారం. ఆయన ఈ విషయంపై సిఎంకు లేఖ రాసే అవకాశాలూ కనిపిస్తున్నాయి.