సాగర్ లో  సంకుల సమరం

నాగార్జున సాగర్  అసెంబ్లీ ఉప ఎన్నిక ఎప్పుడుంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూలు విడుదల చేస్తుంది, అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది.  ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ సాగర్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార తెరాసకు అయితే అనివార్యంగా గెలిచి తీరవలసిన ఎన్నిక సాగర్ ఉప ఎన్నిక. అందుకే అన్నికోణాల్లో పోరుకు సిద్ధమవుతోంది.  ఉప ఎన్నికలో ఓడి పోయినంత మాత్రాన ముఖ్యంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పెమీలేదు.దుబ్బాకలో ఓడిపొతే, ఏమి జరిగిందో, రేపు నాగార్జున సాగర్ లో ఓడి పోయినా అదే జరుగుతుంది.అంతకు మించి ప్రభుత్వానికి వచ్చేది, పోయేది ఏదీ ఉండదు. ప్రభుత్వం ఎప్పటిలానే  సుస్థిరంగా సాగిపోతుంది. 

ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేక పోయినా సాగర్ లో ఓడిపోతే అధికార పార్టీకి గుండెలు పగిలే షాక్ అయితే తప్పదు. ఎందుకంటే, నాగార్జున సాగర్ పార్టీ సిట్టింగ్ సీట్ .సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే దుబ్బాక సిట్టింగ్ సీట్ కోల్పోయిన అధికార పార్టీ అదే క్రమంలో మరో సిట్టింగ్ సీట్, నాగార్జున సాగర్ కూడా చేజార్చుకుంటే, పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడిపోతుంది. ఇప్పటికే అనేక కారణాల చేత అసంతృప్తితో రగిలిపోతూ కూడా సమయం కోసం ఎదురుచూస్తూ, అసంతృప్తిని అణిచి పెట్టుకుంటున్న నేతలు తిరుగుబాటు జెండా ఎగరేసినా ఎగరేయ వచ్చును. అందుకే,ఏది ఏమైనా సాగర్ లో గెలిచి తీరాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షడు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు.

ముఖ్యంగా అభ్యర్ధి ఎంపిక విషయంలో దుబ్బాకలో చేసిన తప్పు చేయకుండా, స్థానిక బీసీ అభ్యర్ధిని బరిలో దించేందుకు, స్వయంగా సీఎం తమ దృష్టిలో ఉన్న  ముగ్గురు నలుగురు బీసీ నాయకుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. సాగర్ లో సత్తా చాటేందుకు బీజేపీ కూడా తహతహ లాడు తున్నా, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్,తెరాసల మధ్యనే ఉంటుందని, ఇటీవల ముఖ్యమంత్రి జరిపించిన సర్వేలో స్పష్టమైన నేపధ్యంలో,ఇప్పటికే ఖరారైన కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి గట్టిగా ఢీ కొనే సామర్ధ్యం గల బీసీ నేత కోసం కేసీఆర్ ..  ఆశావహులు అందరినీ  కాచి  వడపోస్తున్నారు. ఇలా ఓ వంక అభ్యర్ధి ఎంపిక కసరత్తు సాగిస్తూనే మరో వంక క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీలలోని బలమైన నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తగిలిన గాయాల నుంచి బయటపడేందుకు సాగర  ఉప న్నిక ఒక చక్కని అవకాశంగా భావిస్తోంది. అందుకే అందరికంటే ముందుగా, రెడీగా ఉన్న పార్టీ సీనియర్ నాయకుడు, ఎయిట్ టైమ్స్ ఎమ్మెల్యే జానారెడ్డి పేరును ప్రకటించింది. ఆయన తన దారినతాను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వయసులో ఎన్నికల బరిలో దిగడం, తనకు అవసరం లేదని అయితే, అధికార పార్టీ  అహంకారాన్ని,  అరాచక పాలనను ఎండగట్టేందుకే పోటీ చేస్తున్నానని, చెప్పడంతో ఆయన పట్ల ప్రజల్లో ఒకవిధమైన సానుభూతి వ్యక్తమవుతోంది. అదీగాక నియోజక వర్గంలోనే కాకుండా, మొత్తంగా రాష్ట్రంలో పార్టీలు, కులాలకు అతీతంగా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. పెద్దాయనగా ఆయన్ని గౌరవించే వాళ్ళు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. చివరకు, కేసీఅర్, కేటీఅర్ కూడా ఆయనకు సముచిత గౌరవం ఇస్తారు. సభలో కానీ, బయట కానీ ఆయన్ని గౌరవంగా సంభోధిస్తారు. ఇతర నాయకుల పట్ల ప్రయోగించే చౌకబారు భాషను, జానా దగ్గర ప్రయోగించరు. కాబట్టి ఆయన్ని ఢీ కొనడం ఎవరికైనా అంత ఈజీ కాదు. 

ఇదిలా ఉంటే  దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో ఉన్న బీజేపీ,  తెరాస ప్రత్యామ్నాయం పరుగులో మరో మారు విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గెలిచినా ఓడినా  రేస్ లో నిలిచేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. సో.. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చినా  సాగర్ ఉప ఎన్నిక మరో సంకుల సమరానికి మరో   సంగ్రామానికి సిద్దమవుతోంది.