రావణుడెంత గొప్పవాడో తెలిసింది: నాగార్జున

 

 

 

చిన్నప్పుడు రామాయణం, మహాభారతం చూసి ఆహా రాముడెంత మంచోడు, దుర్యోధనుడెంత చెడ్డోడు అనుకునేవాళ్లం కదా మనమంతా... టాలీవుడ్‌ స్టార్‌ నాగార్జున కూడా అంతేనట. అయితే మనలో చాలామందిమి ఇప్పటికీ అలాగే అనుకుంటాం కానీ... మన నాగ్‌కు మాత్రం అలా అనుకోవడం లేదట. హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఎవర్‌గ్రీన్‌ అందగాడు తన శ్రీమతి అమలతో సహా పాల్గొని బోలెడన్ని ముచ్చట్లు చెప్పాడు. శూర్పణఖ అనే ఒక మహిళ ముక్కు చెవులు కోసేసేంత క్రూరత్వం ఉన్న వారి దగ్గర కన్నా తన దగ్గరే సీత క్షేమంగా ఉంటుందనే భావనతోనే రావణుడు సీతను అపహరించాడనే కొత్త లాజిక్‌ను ‘అసుర’ పుస్తకరచయిత కన్విన్సింగ్‌గా చెప్పిన తీరు తనకు నచ్చిందన్నాడు నాగ్‌.

 

అంతేకాదు మరెన్నో లక్షణాలు తెలుసుకున్నాక రావణుడు, కర్ణుడు... వీరంతా ఎంత గొప్పవారో తెలిసొచ్చిందన్నాడు. చెట్ల చుట్టూ తిరుగుతూ చేసే డ్యాన్సులు, సినిమాలంటే బోర్‌ కొట్టేస్తుందన్న నాగార్జున ఇలాంటి పుస్తకాల ఆధారంగా ఎవరైనా సినిమాలు తీస్తే నటించాలని ఉందన్నాడు. 2013 అత్యంత దురద్రుష్టకరమైన సంవత్సరమని, రానున్న ఏడాది అందరికీ బాగుండాలని ఆశిస్తున్నానన్నారాయన. ఇంతకీ ఈ మాటలంటున్నపుడు ఆయన పక్కనే ఉన్న అమలకు...  ఏకపత్నీవ్రతుడైన రాముడంటే భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో, రావణుడంటే ఎంత ద్వేషమో తెలుసో లేదో...