నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న ఆయన లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజల కార్యక్రమంలోనూ, అనంతరం మసీదులో ప్రార్ధనలలోనూ తారకరత్న పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో అడుగు కదిపారు. నడుస్తుండగానే ఒక్క సారిగా తారకరత్న కుప్పకూలిపోయారు.

ఆయనను వెంటనే కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పీఈఎస్ హాస్పటల్ కు తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న నాడి అందడం లేదనీ, శరీరం రంగు కూడా మారిందని వైద్యులు తెలపారు. దాదాపు 45 నిముషాల చికిత్స అనంతరం ఆయన పల్స్ నార్మల్ కు చేరుకుందని వివరించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

తారకరత్నకు గుండె పోటు వచ్చిందని అంటున్నారు. హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. చంద్రబాబు తారకరత్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను కోరారు. అవసరమైతే తారకరత్నను బెంగళూరు తరలించే అవకాశం ఉంది.