అందుకయితే రాజీనామాకి సిద్దం:మురళీ మోహన్

 

దేశంలో మరే రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో తెదేపా, బీజేపీలు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఉద్యమాలు ఊపందుకొంటున్నాయి. ఎంపీ మురళీ మోహన్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకి వాస్తవిక పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేసారు.

 

“ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అది ఎవరి మద్దతుపై ఆధారపడి లేదు. అందువలన మేము రాజీనామాలు చేసినా దానిపై ఎటువంటి ఒత్తిడి, ప్రభావం ఉండదు. కనుక మేము ఎంపీలుగా ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మేము రాజీనామా చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే మేము ఈ క్షణమే రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నాము. కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన మరింత నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర విభజన వలన తీవ్రంగా నష్టపోయిన మన రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కావలసిందే. అందుకోసమే మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ప్రత్యేక హోదా కోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము” అని తెలిపారు.