పవన్‌ పరపతి తగ్గిపోతుందా? ముద్రగడ బహిరంగ లేఖ?

 

పీఆర్పీకి కాపు పార్టీ అంటూ ముద్రపడటంతోనే ప్రజారాజ్యం పార్టీని అన్నివర్గాలు ఆదరించలేదని గుర్తించిన పవన్‌ కల్యాణ్‌... జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ ఒక్క కులానికో తనను పరిమితం చేయొద్దంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. తాను అందరివాడినని, తనకు అన్నివర్గాలూ సమానమేనని ప్రజల ముందు ఆవిష్కరించుకుంటూ వచ్చారు. ముద్రగడ పోరాటంతో కాపు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి... తుని సంఘటన జరిగినా రిజర్వేషన్ల డిమాండ్‌‌కు మద్దతుగా పవన్‌ స్పందించలేదు. కానీ ఫస్ట్‌ టైమ్‌ కాపు రిజర్వేషన్లు, ముద్రగడ పోరాటంపై పాజిటివ్‌గా స్పందించారు. కాపు రిజర్వేషన్లను టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు బీసీ నేతలు వ్యతిరేకించలేదని పవన్‌ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లు సున్నితమైన అంశమన్న పవన్‌... బీసీలకు నష్టం జరగకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

 

అలాగే ముద్రగడ శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటానంటే... ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పైగా కాపు రిజర్వేషన్లకు మద్దతుగా పవన్‌ పాజిటివ్‌ కామెంట్స్‌ చేయడంతో... ముద్రగడ స్పదించారు. పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుతో ప్రయాణించి మీ పరపతి తగ్గించుకోవద్దంటూ సూచించారు. చంద్రబాబు చెప్పే అబద్దాలు నమ్మొద్దని కోరారు. కాపు ఉద్యమంపై చంద్రబాబు... మీతో ప్రస్తావించినట్లు... టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చిందని, గతంలో జీవో 30ని హైకోర్టు కొట్టేసినట్లుగా... ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల జీవో ఇవ్వమని ఉద్యమకారులు డిమాండ్‌ చేస్తున్నారని... చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేసినట్లు రాశారని లేఖలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు మాటలు నమ్మడానికి కాపు జాతి సిద్ధంగా లేదని ముద్రగడ అన్నారు.  ఏడు నెలల్లో బీసీ కమిషన్‌ నివేదిక తెప్పిచి కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మంజునాథ కమిషన్ వేసి... 18 నెలలు అయినా ఇప్పటివరకూ అతీగతీ లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు... మంజునాథ కమిషన్‌ వేసి 18 నెలలు, పల్స్‌ సర్వే పూర్తయి ఏడాది గడిచిపోయిందని... కానీ ఇంతవరకూ హామీని మాత్రం నెరవేర్చలేదని పవన్‌కి రాసిన లేఖలో ముద్రగడ వివరించారు.

 

కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని అడుగుతుంటే... ఏడు నెలలు ఆగలేరా అంటూ ఎదురుదాడి చేస్తున్నారన్న ముద్రగడ.... అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నప్రభుత్వాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేమన్నారు. చంద్రబాబు మాటలు వినడానికి కాపు జాతి సిగ్గుపడుతోందన్న ముద్రగడ... ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలుగా మారాయన్న సంగతి తెలుసుకోవాలని పవన్‌ను కోరారు. అందుకే చంద్రబాబు చెప్పే అబద్దాలను నమ్మి... మీ పరపతిని తగ్గించుకోవద్దంటూ పవన్‌కు ముద్రగడ సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu