గాంధీ మెచ్చిన సుబ్బులక్ష్మి స్వరం

 

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి జీవితాన్ని పరిచయం చేయాలనే ప్రయత్నం, సాగరాన్ని గుప్పిట్లో బంధించడంలాంటిది. కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా, భక్తి సంగీతానికి నిర్వచనంగా నిలిచిన ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి శతజయంతి సందర్భంగా ఆమె ప్రతిభను చాటే ఒక ఉదంతాన్ని తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి తన పదకొండవ ఏట నుంచే సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆమె చేసే ఒకో సంగీత కచేరీతో ఆమె గాత్ర మాధుర్యం లోకమంతా విస్తరించడం మొదలైంది. ఇక 1947లో హిందీలో వచ్చిన మీరాబాయి చిత్రంలో ఆమె పాడిన భజనలతో ఎమ్మెస్‌ దేశవ్యాప్తంగా సంగీతసంచలనంగా మారిపోయారు. ఆ చిత్రంలో ఎమ్మెస్‌ పాడిన పాటలకు ముగ్ధులైపోయిన జవహర్‌లాల్‌ నెహ్రూ ‘నేను కేవలం ఒక ప్రధానమంత్రిని మాత్రమే! సంగీతానికి రాణి అయిన ఆమె ముందు నేనెంత?’ అనేశారు.

 

ఇంచుమించు అదే సమయంలో సుబ్బులక్ష్మి భర్త సదాశివంగారికి గాంధీగారి నుంచి ఒక ఫోన్‌ వచ్చింది. బహుశా గాంధీగారు మీరాబాయి చిత్రంలోని పాటలను విన్నారో ఏమో... తనకు ఇష్టమైన ఒక మీరాబాయి భజనను ఎమ్మెస్‌ గాత్రంలో వినాలని ఉందని ఆయన కోరారు. అయితే ఎమ్మెస్‌ ఆ కోరికను సున్నితంగా తిరస్కరించారు. గాంధీగారు కోరుకుంటున్న ఆ భజన తనకు అంతగా పరిచయం లేదనీ, దానికి తాను న్యాయం చేయలేననీ ఎమ్మెస్ భయం. అయితే ఆ సాయంత్రం నేరుగా గాంధీగారి నుంచే మరో ఫోను వచ్చింది. ఎమ్మెస్ ఆ భజనను పాడాల్సిన అవసరం లేదనీ, కనీసం ఆమె దానిని చదివినా తనకు తృప్తిగా ఉంటుందనీ ఆయన అన్నారు. గాంధీగారు అంతగా కోరుకోవడంతో, రాత్రికిరాత్రే ఎమ్మెస్‌ ఆ భజనను రికార్డు చేసి దిల్లీకి పంపారు.

 

ఈ ఘటన జరిగిన కొద్ది నెలల తరువాత ఎమ్మెస్ ఒక రోజు రేడియోలో వార్తలను వింటున్నారు. ఆ రోజు 1948 జనవరి 30. గాంధీని అత్యంత దారుణంగా కాల్చి చంపిన రోజు. రేడియోలో ఆ వార్తని వింటూనే ఎమ్మెస్ మ్రాన్పడిపోయారు. ఆ వార్తని వినిపించిన వెంటనే రేడియోలో తాను గాంధిగారి కోసమని పాడిన మీరా భజన ప్రసారం అయ్యింది. ఆ భజన వినడంతోనే ఎమ్మెస్ స్పృహ కోల్పోయారు. ఆ తరువాత కాలంలో ఎమ్మెస్‌ తరచూ ఈ సంఘటనలన్నింటినీ కన్నీటితో గుర్తుచేసుకునేవారట.

 

గాంధీ అంతటివారు అంతగా కోరి పాడించుకున్న ఆ భజన ‘హరి తుమ్‌ హరో’ (hari tum haro). యూట్యూబ్‌లో ఆ భజనని ఎవరైనా వినవచ్చు. దేశాన్ని నడిపించే నేతలైనా, ప్రపంచాన్ని నడిపించే నాయకులైనా... కళలకు కరిగిపోక తప్పదని ఈ ఉదంతం నిరూపిస్తుంది. ఎవరితోనైనా చివరివరకూ తోడుగా నిలిచేది ఆ కళే అని చాటి చెబుతోంది.

 

- నిర్జర.