జూలైలో పార్లమెంట్ సెషన్!.. జగన్‌రెడ్డికి దబిడి దిబిడే...
posted on Jun 8, 2021 7:22PM
కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. పరిస్థితులు ఇలానే కుదటపడితే.. జూలైలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దపడుతోంది. ఈ బ్రేకింగ్ న్యూస్.. అందరికీ గుడ్ న్యూస్ అయితే.. ఒక్క జగన్‌రెడ్డికి మాత్రం వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎందుకంటే.. పార్లమెంట్ సెషన్ కోసమే ఎంపీ రఘురామ వెయిట్ అక్కడ. ఈ మాటే జగన్‌రెడ్డి గుండెదడను అమాంతం పెంచేస్తోందట. త్వరలోనే పార్లమెంట్ సమావేశాలు అనగానే.. వైసీపీ సర్కారులో ఉలిక్కిపాటు మొదలైందని అంటున్నారు. ఎందుకంటే విషయం అలాంటిది మరి. గాయపడిన బెబ్బులిలా ఢిల్లీలో కాచుకు కూర్చున్న రఘురామ.. తనపై జరిగిన దారుణంపై పార్లమెంట్‌లో ప్రకంపణలు సృష్టించేందుకు చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నారు మరి.
ఎప్పుడెప్పుడు పార్లమెంట్ తలుపులు తెరుస్తారా.. ఎప్పుడెప్పుడు తనకు జరిగిన అన్యాయాన్ని దేశ అత్యుత్తమ సభలో చెవులు చిట్లుపడేలా మొరపెట్టుకోవాలా.. అని రఘురామ వెయిట్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే.. సీఎం జగన్‌రెడ్డిని సభలో ఎండగట్టేందుకు.. దేశం ముందు దోషిగా నిలబెట్టేందుకు.. తగిన కార్యచరణ ఇప్పటికే సిద్ధం చేసేశారు. తనపై రాజద్రోహం కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి.. కస్టడీలో హింసించారంటూ.. ఒక ఎంపీగా తనపై జరిగిన దాడిని పార్లమెంట్‌పై జరిగిన దాడిగానే చూడాలంటూ.. దేశంలోని అన్నిపార్టీల ఎంపీలకు లేఖలు రాశారు. తన కాలికి అయిన గాయాల ఫోటోలను సైతం ఆ లేఖకు జత చేశారు. జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే తనను అలా హింసించారని సహచర ఎంపీల దృష్టికి తీసుకొచ్చారు రఘురామ.
రఘురామకు జరిగిన దారుణంపై ప్రాంతాలు, పార్టీలకతీతంగా అనేక మంది ఎంపీల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. బహిరంగంగానే వారంతా సోషల్ మీడియా వేదికగా రఘురామకు మద్దుతు ప్రకటించారు. ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగాన్ని ఖండిస్తూ.. జగన్‌రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. తామంతా రఘురామకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో పోరాడుతామని.. సభలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు.
(2).jpg)
లోక్‌సభ స్పీకర్‌కు సైతం రఘురామ విషయం తెలుసు. స్వయంగా రఘురామనే స్పీకర్‌ను కలిసి తన కాలి గాయాలను చూపించారు. ఒక ఎంపీపై జరిగిన దాడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దారుణం కేంద్ర హోంశాఖ, రక్షణశాఖ మంత్రి దృష్టికీ వెళ్లింది. ఇక, జగన్ మినహా దేశంలోని 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ రఘురామ లేఖలు రాశారు. తమ పార్టీ ఎంపీలను పార్లమెంట్‌లో తనకు మద్దతుగా నిలిచేలా చూడాలని కోరారు. ఇలా, తన సొంత పార్టీ వైసీపీ మినహా దేశంలోని ప్రతీ ఒక్క పార్లమెంట్ సభ్యుడినీ.. తనకు జరిగిన అన్యాయంపై జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా సభలో గళం విప్పేలా.. తనకు మద్దతుగా నిలిచేలా.. సిద్ధం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన నుంచి ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని.. పాపం జగన్‌రెడ్డి ఊహించలేకపోయారని అంటున్నారు. అందుకే, పార్లమెంట్ సమావేశాలు అనగానే జగన్‌రెడ్డిలో కలవరం మొదలైందని చెబుతున్నారు. అదే సమయంలో రఘురామ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పార్లమెంట్ సెషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సెషన్ తొలిరోజే తన అంశం ఎజెండాలో చేర్చేలా చేసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
జైల్లోనే మగ్గేలా చేద్దామని రఘురామపై రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే.. ఆయన ఏపీ చెరలోంచి తుర్రున జారుకొని.. ఢిల్లీకి చేరి.. కమాన్, వెయిటింగ్ ఇక్కడ.. అంటూ జగన్‌రెడ్డికి సవాల్ విసురుతుండటం కలకలం రేపుతోంది. పార్లమెంట్ సాక్షిగా.. దేశప్రజల ముందు జగన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టి.. శిక్షించేందుకు సిద్దమవుతుండటం సంచలనం. రఘురామ ఎత్తుగడలు ఊహాతీతం.. అంచనాలకు మించి.. అంతకుమించి.. ఉంటుండటం ఆసక్తికరం.