ఈటలకు కాంగ్రెస్ సపోర్ట్! బీజేపీకి షాక్ తప్పదా..
posted on Jun 8, 2021 7:03PM
ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాల్లో ఈ పదమే ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అన్ని పార్టీల రాజకీయమంతా ఆయన చుట్టే తిరుగుతోంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్.. భవిష్యత్ కార్యాచరణలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీలో చేరుతానని ఈటల అంతర్గత సంభాషల్లో చెబుతున్నా.. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా.. ఇంకా చేయలేదు. రాజీనామా చేయకుండానే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటల రాజకీయ గమనంపై మళ్లీ కొత్త చర్చలు జరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్లు ఈటల విషయంలో మరింత గందరగోళం కల్గించేలా ఉన్నాయి. ఈటల రాజేందర్ ఇప్పుడే బీజేపీలో చేరకపోవచ్చని తెలుస్తోంది.
ఈటల బీజేపీలో చేరడం ఖాయమని తెలిసిన తర్వాత కూడా ఆయనపై కాంగ్రెస్ ఇంకా సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల ప్రకటనలు కూడా అలానే ఉంటున్నాయి. రాజేందర్ ఇంకా బీజేపీలో చేరకపోవడంతో.. ఆయన కోసం కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారని అనిపిస్తోంది. రాజేందర్ తో ఎంపీ రేవంత్ రెడ్డి టచ్ లోనే ఉన్నారని అంటున్నారు. అందుకే ఈటల బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్నా ఆయన స్పందించడం లేదని చెబుతున్నారు.
ఈటల కాంగ్రెస్ లో చేరితే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా వ్యాఖ్యానించారు. తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ లో స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని చెప్పారు. ఇండిపెండెంట్‌గా ఈటల నిలబడితే 50 వేల ఓట్లతో గెలుస్తారని జీవన్‌రెడ్డి తెలిపారు. ఈటల బీజేపీలో చేరడం వల్ల బలహీన పడ్డారని చెప్పారు. ఈటల బీజేపీలో చేరతానని తన వ్యక్తిత్వాని తగ్గించుకున్నారన్నారు. టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందన్నారు. అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలన్నారు జీవన్ రెడ్డి.
ఎమ్మెల్యే పదవికి రాజేందర్ ఇంకా రాజీనామా చేయకపోవడం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. హుజూరాబాద్ లో బీజేపీ కంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తేనే బెటరని ఈటల భావిస్తున్నారని తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే... కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆయనకు కొందరు అనుచరులు సూచిస్తున్నారట. అందుకే బీజేపీలో చేరికను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. హుజూరాబాద్ లో గెలిచిన తర్వాత బీజేపీలో చేరితే.. బలం కూడా పెరుగుతుందని.. బీజేపీకి కండీషన్లు కూడా భారీగా పెట్టవచ్చని ఆయన అనుకుంటున్నారని తాజా సమాచారం. అందుకే నియోజకవర్గంలో తిరుగుతున్నారని అంటున్నారు. నియోజకవర్గ జనాల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈటల తదుపరి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.