టోల్‌గేట్ పై ఎంపీ కొడుకు వీరంగం...
posted on Apr 24, 2017 12:25PM

రాజకీయ నాయకులు తమ అధికారం చూపి సామాన్య ప్రజలపై తమ ప్రభావం చూపుతారు. ఇక తమ తండ్రుల అధికారం చూసి కొంతమంది పుత్రరత్నాలు కూడా తమ ప్రభావాన్ని చూపుతుంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో అంబరీష్ బాగేపల్లి టోల్‌గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే అక్కడ టోల్ గేట్ సిబ్బంది రుసుము చెల్లించాలని చెప్పగా... తాను ఎంపీ కుమారుడినని చెప్పాడు. అయితే ఎంపీలు ప్రయాణించే వాహనాలకు మాత్రమే టోల్ రుసుము మినహాయింపు ఉంటుందని.. ఎంపీ కుమారులకు ఉండదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా తన అనుచరులను పిలిపించి మరీ దాడి చేయించాడు. టోల్‌గేట్ క్యాబిన్ అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.