అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు
posted on Jul 19, 2025 3:03PM

టీమ్ ఇండియా మజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ ఇంట్లో దొంగలు పడ్డారు. హైదరాబాద్‌లో కాదులేండి.. మహారాష్ట్రలోని నివాసంలో. ఆయన భార్య సంగీత బిజిలానీ పేరిట మహారాష్ట్రలోని లోనావాలాలో ఓ బంగ్లా ఉంది. ఈ బంగ్లాలో గత కొద్ది కాలంగా ఎవరూ ఉండడం లేదు. తాజాగా ఆ ఇంటిని తెరిచి చూడగా చాలా వస్తువులు ధ్వంసమైనట్టు కనిపించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి జూలై 18 మధ్యలోనే ఈ దొంగతనం జరిగింది. దీంతో బంగ్లా సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లా వెనుక కాంపౌండ్ గోడ వైర్ మెష్‌ను తెంచుకుని లోపలికి చొరబడ్డారు.
మొదటి అంతస్తు పైకి ఎక్కి, కిటికీ గ్రిల్‌ను బలవంతంగా తెరిచి బంగ్లాలోకి ప్రవేశించారు. లోపల ఉన్న రూ.50,000 నగదును, రూ.7,000 విలువైన టెలివిజన్ సెట్‌ను దొంగిలించారు. అలాగే ఇంటిలోని పలు వస్తువులను కూడా నిందితులు ధ్వంసం చేశారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఈ విధ్వంసానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఈ చోరీ గురించి పుణె రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.