కొత్త వేషం కట్టిన ఎమ్మెల్సీ కవిత!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత,కొత్త వేషం కట్టారు. పాఠాలు చెప్పే పంతులమ్మగా మారి పోయారు. అయితే  కవితా టీచర్, అందరు టీచర్లు చెప్పే పాఠాలు చెప్పరు. పొలిటికల్ పాఠాలు మాత్రమే చెపుతారు.అది కూడా అందరికీ కాదు.. ఓన్లీ మహిళలు మరియు యువతకు మాత్రమే కవిత మేడం రాజకీయ పాఠాలు  బోధిస్తారు. అందు కోసం  ఆమె  తెలంగాణ జాగృతి తరపున 'లీడర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాగుంది.. ఒకప్పుడు కమ్యూనిస్ట్  పార్టీలు  రాజకీయ పాఠశాలలు నిర్వహించేవి.  అలాగే ఇతర పార్టీలు కూడా శిక్షణ తరగతులు నిర్వహించేవి. ఇప్పుడు అలాంటి పాఠశాలలు ఉన్నాయో లేదో తెలియదు కానీ.. వాటి  అవసరం అయితే వుంది. 

యువతను రాజకీయాల్లోకి రప్పించి, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా కవిత పేర్కొన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని తెలిపారు.రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలుకుతుందని   కవిత సెలవిచ్చారు. 
సో .. సంకల్పం మంచిదే. అదీ కాకుండా ఆమే అన్నట్లు  మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ముందు ముందు రాజకీయ నాయకుల అవసరం, మరీ ముఖ్యంగా..  ఎన్నికల్లో పోటీ చేసే మహిళా నాయకుల అవసరం పెరుగుతుంది. అలాగే..  బీసీ రిజర్వేషన్స్ అమలులోకి వచ్చిన తర్వాత  బీసీ నాయకులకు డిమాండ్ పెరుగుతుంది. సో .. కవిత సంకల్పం వరకు అయితే బాగుంది. కానీ.. ఢిల్లీ లిక్కర్ కుంభ కోణంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఆమెకు ఆ ఆర్హత, యోగ్యతా ఉన్నాయా  అనేదే ప్రశ్న.   
సరే.. ఆమెకు ఆ అర్హత,యోగ్యతా ఉన్నాయా అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా.. నిజంగా ఆమె సంకల్పం అదేనా లేక అటు పార్టీకి, ఇటు ఫ్యామిలీకి దూరమై కొని తెచ్చుకున్న మనుగడ సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆమె కొత్త వేషం కట్టరా అనేది పెద్ద పజ్లింగ్  ప్రశ్న. గత వారం పది రోజులుగా ఆమె పడుతున్న అగచాట్లు, ఫేస్ చేస్తున్న అవమానాలను గమనిస్తే..  కవిత  లీడర్  కార్యక్రమం పరమార్ధం  మనుగడ కాపాడు కోవడం కోసమే అని వేరే చెప్ప నక్కర లేదు. 

అవును.. ఉదర పోషణార్ధం బహుకృత వేషం  అంటారు పెద్దలు. అది కాకా పోయినా, కోటి విద్యలు కూటి కొరకే  అనే సామెతను అయితే అందరూ వినే ఉంటారు. అంటే..  బతుకు తెరువు కోసం అనేక వేషాలు వేయక తప్పదని అర్థం. ఆఫ్టరాల్  పొట్ట కూటి కోసమే ఎన్నో వేషాలు వేయక తప్పనప్పుడు రాజకీయాల్లో రాణించాలంటే ఇంకెన్ని వేషాలు వేయవలసి ఉంటుందో వేరే చెప్ప నక్కర లేదు. అందులోనూ.. కాలం కలసి రానప్పుడు, కష్టాలు చుట్టిముట్టినప్పుడు రాజకీయ నాయకులు అవసరార్ధం వేషాలు మార్చక తప్పదు.. ఇప్పడు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినాయకురాలు కవిత పరిస్థితి కూడా అదే. అందుకే, ఆమె పంతులమ్మ వేషం కట్టారని అంటున్నారు.