గుండెల్ని మెలి పెడుతున్న మృతుల బంధువుల ఆవేదన
posted on Jun 16, 2025 2:12PM

అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటనలో సజీవ దహనమైన వారి మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో అవి ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారింది. ప్రతి శరీర భాగానికి డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. మరోవైపు మాంసపు ముద్దలు ఇచ్చి.. ‘ఇవి మీ వారివే’ అని వైద్యులు చెబుతుంటే.. బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఒకట్రెండు ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ వారు పడుతున్న ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.
డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలోని మార్చురీ వద్ద.. మృతదేహాన్ని తీసుకొచ్చే సంచీలో రెండు తలలు ఉండటం వివాదానికి తావిచ్చింది. అప్రమత్తమైన వైద్యాధికారులు వెంటనే మరోసారి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. తన కుటుంబ సభ్యుల అవశే షాలన్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకున్నారు. అయితే.. అది సాధ్యం కాదని అతి కష్టం మీద ఆయనను అధికారులు ఒప్పించారు. కష్టమని తెలిసినా.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో బాధిత కుటుంబీకులు వైద్యులను ప్రాధేయపడుతున్న తీరు కన్నీరు తెప్పిస్తోంది. ఓ వైపు కుటుంబీకులను కోల్పోయామన్న బాధ. మరోవైపు కనీసం వారి మృతదేహాలను కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నామన్న ఆవేదనతో ఆస్పత్రి ఆవరణలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
విమాన ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను అహ్మదాబాద్‌లోని 1200 పడకల సివిల్ ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తసంబంధీకుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, మృతదేహాల నమూనాలతో సరిపోల్చి.. బంధువులకు అప్పగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది మృతుల డీఎన్‌ఏను వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. డీఎన్‌ఏ పరీక్షతో పనిలేకుండా బంధువులు గుర్తుపట్టిన 8 మృతదేహాలను ఇప్పటికే వారి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. వీలైనంత వరకు మిగతా మృతుల డీఎన్‌ఏను గుర్తించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కుటుంబాలతో సమన్వయం చేసుకోవడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.