కన్నీళ్లు పెట్టిన ఎమ్మెల్యే సీతక్క
posted on Jun 25, 2021 7:23PM
నిత్యం జనంలో ఉంటూ.. ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కొవిడ్ సమయంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. రాజకీయ నాయకులంటే సీతక్కలా ఉండాలనే జనాలు చెప్పుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నంటూ సేవ చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క కన్నీళ్లు పెట్టారు.
మావోయిస్టు అగ్ర నేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్ అలియాస్ జగన్ కరోనా సోకి కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత సీతక్క హరిభూషన్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మహబూబాబాద్ జిల్లా, గంగారం మండలంలోని మడగూడెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. హరిభూషన్ కుటుంబసభ్యుల ఇల్లు మామూలు రేకుల ఇల్లు. అక్కడికి వెళ్లిన సీతక్క .. ఆ పరిస్థితులు చూసి చలించిపోయారు. హరిభూషన్ కుటుంబసభ్యులు సీతక్క మీద పడి రోదించారు. దీంతో సీతక్క కూడా కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత వారిని ఓదార్చారు.
హరిభూషన్ మరణించడం బాధాకరమైన విషయం అన్నారు సీతక్క. ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. సీతక్క మావోయిస్టుగా ఉన్న సమయంలో హరిభూషన్ తో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరి టీం లీడర్ గా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని చెప్పారు. సీతక్క రావడంతో హరిభూషన్ స్వగ్రామం మడగూడెంలో ఉద్వేగ వాతావరణం కనిపించింది.